తొందరపడి కాంగ్రెస్‌లో చేరొద్దు.. తర్వాత ఇక్కడికే వస్తారు: బీజేపీ ఎంపీ
- రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమన్న ధర్మపురి అర్వింద్
- ఖమ్మంలో ఎట్లా గెలవాలనే దానికి తమ దగ్గర వ్యూహం ఉందని వెల్లడి
- బిడ్డను కాపాడటానికే కేసీఆర్ తాపత్రయమని ఎద్దేవా
నేతల చేరికలతో తెలంగాణ కాంగ్రెస్ జోష్ మీద ఉంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరిక కోసం ఢిల్లీ స్థాయిలో చర్చోపచర్చలు జరిగాయి. వారు కాంగ్రెస్‌లో చేరడం కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నేతలు తొందరపడి కాంగ్రెస్ లో చేరొద్దని ఆయన సూచించారు. కాంగ్రెస్ లో చేరిన వాళ్లంతా తిరిగి బీజేపీలోకే వస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖమ్మంలో బీజేపీ ఎట్లా గెలవాలనే విషయంలో తమ స్ట్రాటజీ తమకుందని చెప్పారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి చెప్పారు. బిడ్డను కాపాడటానికే కేసీఆర్ తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కుటుంబ పార్టీలకు ఓటేస్తే వాళ్ల ఆస్తులు పెరుగుతాయని అన్నారు. అదే పిల్లల భవిష్యత్ కావాలంటే బీజేపీకి ఓటెయ్యాలని మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.