హిండెన్ బర్గ్ నివేదికపై వాటాదారులకు గౌతమ్ అదానీ సందేశం

  • సంస్థను అప్రతిష్ఠపాలు చేసి దెబ్బతీసేందుకు హిండెన్ బర్గ్ తప్పుడు సమాచారం వండి వార్చిందన్న అదానీ 
  • హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా ఫాలో ఆన్ పబ్లిక్ ను వెనక్కి తీసుకున్నామని వెల్లడి
  • అదానీ గ్రూప్ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టిందన్న అదానీ
  కొన్ని నెలల క్రితం అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ రిపోర్ట్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ కుప్పకూలాయి. హిండెన్ బర్గ్ నివేదికపై తాజాగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు. వాటాదారులకు ఇచ్చిన సందేశంలో... వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి హిండెన్ బర్గ్ తప్పుడు సమాచారాన్ని వండి వార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద ఫాలో ఆన్ పబ్లిక్ కు వెళ్తున్న సమయంలో హిండెన్ బర్గ్ తన నివేదికను వెలువరించిందని, సంస్థను అప్రతిష్ఠపాలు చేసేందుకు తప్పుడు, చౌకబారు ఆరోపణలు చేసిందన్నారు. ఈ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ ప్రభావితమయ్యాయన్నారు. దీంతో ఎఫ్‌పీవోను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందన్నారు.

ఇన్వెస్టర్లకు సొమ్మును తిరిగి ఇచ్చేశామని, హిండెన్ బర్గ్ నివేదికతో కంపెనీ అనేక ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అదానీ గ్రూప్ స్టాక్ ధరలను ఉద్దేశపూర్వకంగా తగ్గించడం ద్వారా హిండెన్ బర్గ్ లాభాలను ఆర్జించిందన్నారు. అయితే వ్యక్తిగత ప్రయోజనాల కోసం హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ కూడా అదానీ గ్రూప్ కంపెనీలు అవకతవకలకు పాల్పడలేదని తేల్చిందన్నారు. ఈ కమిటీ సమర్పించిన నివేదిక ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపడానికి దోహదపడిందని చెప్పారు. కంపెనీ వెల్లడించిన వివరాల్లో లేదా నియంత్రణ పరమైన లోపాలు లేవని ఈ కమిటీ తేల్చిందన్నారు. మరో నెల రోజుల్లో సెబీ కూడా నివేదికను సమర్పించబోతుందని, తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు.


More Telugu News