నేడు హైదరాబాద్ లో తేలికపాటి వర్షం

  • ఒడిశా, ఝార్ఖండ్ లలో కొనసాగుతున్న అల్పపీడనం
  • ఏపీ, తెలంగాణలలో మోస్తరు వర్షాలు
  • హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈమేరకు మంగళవారం తాజా వెదర్ రిపోర్ట్ విడుదల చేసింది. ఉత్తర ఒడిశా, దక్షిణ ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ లో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. సోమవారం హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా కుమ్రం భీం జిల్లా సిర్పూర్‌ (టీ)లో 7 సెం.మీ వర్షపాతం నమోదైందని చెప్పారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ లో 6 సెం.మీ, బెజ్జూర్‌లో 5 సెం.మీ, నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో 5 సెం.మీ, కామారెడ్డి ఎల్లారెడ్డిలో 4 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.


More Telugu News