కాంగ్రెస్ ను గెలిపించి తెలంగాణ ప్రజలు సోనియా రుణం తీర్చుకోవాలి: జూపల్లి

  • జూపల్లి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం
  • వచ్చే నెల 14న కానీ, 16న కానీ కాంగ్రెస్ లో చేరనున్న జూపల్లి
  • నేడు ఢిల్లీలో ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసిన జూపల్లి
బీఆర్ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి జూపల్లి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. రాహుల్ గాంధీని కలిసి పార్టీలో చేరికపై చర్చించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యం పాతాళానికి పడిపోయిందని, అవినీతి ఆకాశానికి ఎగసిందని అన్నారు. అన్నీ అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి, ఎన్నికల్లో గెలిచాక వాటిని అమలు చేయలేక మళ్లీ కొత్త స్కీములు తెస్తున్నారని, ఇంతకంటే దుర్మార్గమైన పాలన ఇంకెక్కడా ఉండదని పేర్కొన్నారు. 

కేసీఆర్ వంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారని తెలిస్తే, అంబేద్కర్ ఇంకా కొన్ని కొత్త అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచేవారని జూపల్లి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక ఉండరాదని, అసలు ప్రతిపక్షమే ఉండకూడదంటూ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను ఇది అవమానించడమేనని అన్నారు. 

ఇప్పుడు మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండడంతో నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం అంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా... ప్రజలకు చెందిన ఖజానాలోని వందల కోట్ల నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని జూపల్లి మండిపడ్డారు. భారతదేశ చరిత్రలోనే ప్రభుత్వ నిధులతో ప్రకటనలు ఇచ్చుకుంటూ ప్రజలను ఇంతగా మోసపుచ్చడం ఎక్కడా లేదని అన్నారు. 

"అవినీతి, కుటుంబ పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం, బోగస్ మాటలు... ఇవన్నీ చూశాక చాలా పొరపాటు చేశామని అనిపించింది. కేసీఆర్ ప్రభుత్వ పాలన చూస్తుంటే గత ప్రభుత్వాలు పాలించినంత స్థాయిలో కూడా లేదు. ఎక్కడ చూసినా రకరకాల స్కీములు... వాటి వెనుక తోడే కొద్దీ అవినీతి బయటికి వస్తోంది. కాబట్టి ఈ ప్రభుత్వం మూడోసారి పరిపాలించే నైతిక అర్హత కోల్పోయిందని భావిస్తున్నాం. 

ఇప్పుడే నియంత పోకడలు కనిపిస్తున్నాయి... మళ్లీ  అధికారంలోకి వస్తే మంత్రులను, ఎమ్మెల్యేలను కనీసం మనుషులుగా గౌరవిస్తారని మేం అనుకోవడంలేదు. అందుకే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకూడదు. నాడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రమాదంలో పడినా కానీ సోనియా గాంధీ ఎంతో రిస్క్ తీసుకుని తెలంగాణ ఇచ్చారు. ఉద్యమ పార్టీ అన్న అభిప్రాయంతో తెలంగాణ ప్రజలు కేసీఆర్ పార్టీని గెలిపించారు. 

ఇప్పుడీ పరిపాలన చూశాక రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి పరిస్థితి అర్థమైంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది... అది మా బాధ్యత కూడా. ఇలాంటి పరిస్థితుల్లో, ఇకనైనా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం ఇవ్వకపోతే ఆ దేవుడు కూడా క్షమించడు. ఇది ప్రజలకైనా, ప్రజా ప్రతినిధులకైనా వర్తిస్తుంది. ఈ కారణాల వల్లే మేం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం. 

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారం కిందటే మమ్మల్ని కలిశారు. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశాం. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి మహబూబ్ నగర్ లో సభ ఏర్పాటు చేస్తాం. వచ్చే నెల 14 కానీ, 16 కానీ కాంగ్రెస్ లో చేరతాను" అని జూపల్లి వివరించారు.


More Telugu News