మేం కాంగ్రెస్ లోకే ఎందుకు వెళుతున్నామంటే...!: పొంగులేటి

  • పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరిక రంగం సిద్ధం 
  • ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన పొంగులేటి, జూపల్లి
  • రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరతామన్న పొంగులేటి
  • జులై 2న ఖమ్మంలో రాహుల్ సభ
బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. జులై 2న ఖమ్మంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ జరగనుంది. ఈ సభలో పొంగులేటి... రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 

ఇవాళ ఢిల్లీలో పొంగులేటి కాంగ్రెస్ నేతలతో భేటీలు జరుపుతూ బిజీగా గడిపారు. పార్టీలో చేరికపై రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. 

తాను పదవి కోసమే అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోనని, అవినీతి బీఆర్ఎస్ ను గద్దె దింపేందుకే కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నామని స్పష్టం చేశారు.

 "కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు, దేశంలో అధికారంలో లేదు... కాంగ్రెస్ లోకి వెళితే నాకు ఇబ్బందులు ఉంటాయని తెలుసు. ఆల్రెడీ సమస్యలు మొదలయ్యాయి కూడా. అయినా కూడా, ప్రజల కోసం, ప్రజల మనోభావాల కోసం... ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో... ఆ పార్టీకి తెలంగాణ బిడ్డల రుణాన్ని తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం. 

తెలంగాణ బిడ్డలు కోరుకున్నది ఇంకా నెరవేరలేదు. ప్రజలు, యువత ఏం కోరుకుంటున్నారో పరిశీలించాం. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవం కోల్పోయారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అనుకున్నారు. నాకు పదవులు అక్కర్లేదు, పదవుల కంటే ఆత్మాభిమానమే ముఖ్యం. 

నేను రాష్ట్రంలోని పరిస్థితులపై సర్వే చేయించాను. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఒకవైపే కేంద్రీకృతమై ఉంది. ఓ దశలో కొత్తగా ప్రాంతీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా వచ్చింది. రాజకీయ పార్టీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ కూడా జరిపించాను. కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని భావించాను. 

అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. అదే సమయంలో తెలంగాణలో బీజేపీ పరిస్థితి దిగజారుతోంది. ఈ నేపథ్యంలోనే, కాంగ్రెస్ వైపు అడుగులు వేశాను. జులై 2న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను" అని పొంగులేటి వెల్లడించారు. 

కేసీఆర్ వి ఆచరణకు సాధ్యం కాని హామీలని విమర్శించారు. మాయమాటలు చెప్పడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు... ఆ విధంగా మాయమాటలు చెప్పలేకే గతంలో కాంగ్రెస్ ఓటమి పాలైందని పొంగులేటి అభిప్రాయపడ్డారు. ఎన్నికలు వచ్చాయంటే కేసీఆర్ కొత్త స్కీములు తెరపైకి తెస్తారని, మూడోసారి కూడా గారడీ మాటలతో సీఎం కావాలని కేసీఆర్ అనుకుంటున్నారని విమర్శించారు.


More Telugu News