మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: కాంగ్రెస్ నేత మాణిక్‌రావు సవాల్
- మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదన్న మాణిక్‌రావు ఠాక్రే
- మహారాష్ట్రలో కేసీఆర్ టూర్‌తో ఒరిగేదేమీ లేదని వ్యాఖ్య
- బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్‌గా మారిందని కామెంట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే సవాల్ విసిరారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని, ఒక్క సీటు వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. మహారాష్ట్రలో కేసీఆర్ టూర్‌తో ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.
సోమవారం ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు కేసీఆర్ బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాణిక్‌రావు ఠాక్రే స్పందిస్తూ.. బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్‌గా మారిందని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
తెలంగాణలో దోచుకున్న సొమ్మును మహారాష్ట్రలో కేసీఆర్ ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు కేసీఆర్ డబ్బులు పంపారని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.