ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ నే నడ్డా ఎన్నిసార్లు చదువుతారు?: మంత్రి వేముల ప్రశాంత్

  • బీజేపీ నేతలు అభివృద్ధిపై విషం చిమ్మే మాటలు మాట్లాడుతున్నారన్న మంత్రి వేముల 
  • నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిక  
  • మేం కిసాన్ సర్కార్ అంటుంటే వారు రైతులను అరిగోస పెడుతున్నారని వ్యాఖ్య
నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి వేముల ప్రశాంత్ నిప్పులు చెరిగారు. తెలంగాణకు వచ్చిన ప్రతిసారి బీజేపీ నేతలు ఇక్కడి అభివృద్ధిపై విషం చిమ్మే మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నాగర్ కర్నూల్ సభలో నడ్డా వ్యాఖ్యలపై మంత్రి వేముల స్పందించారు. పదేపదే వచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ నే ఎన్నిసార్లు చదువుతారని నిలదీశారు.

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో ఏమైనా అవినీతి జరిగిందా? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. వీటికి కేంద్రం కొసరి కొసరి ఇచ్చింది కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు పూర్తిస్థాయిలో ఇవ్వనప్పటికీ అవార్డులు ఇస్తుందనే విషయం తెలుసా? అని ప్రశ్నించారు. తాము ప్రవేశపెట్టిన రైతు బంధును కాపీ కొట్టిన కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధిలో రైతులకు షరతులు విధించిందన్నారు.

ధరణిని రద్దు చేసి మళ్లీ వీఆర్వో వ్యవస్థను తెచ్చి రైతులను ఇబ్బంది పెడదామనే ఆలోచన బీజేపీది అన్నారు. అబ్ కీ సర్కార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ అంటుంటే.. కేంద్రం మాత్రం రైతులను అరిగోస పెడుతోందన్నారు. పేదలు, రైతులు... రెండు కళ్లలా పని చేస్తున్న కేసీఆర్ ను జైల్లో పెడతారా? అని మండిపడ్డారు. అలాంటప్పుడు అన్నింటినీ అమ్మేస్తున్న మోదీని ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పాలని నిలదీశారు.


More Telugu News