ఓ పార్టీకి అనుకూలంగా పనిచేసే వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలోనా?: జయప్రకాశ్​ నారాయణ

  • ఇలాంటి ప్రయత్నాలు ప్రభుత్వానికి, ఆ ఉద్యోగులకూ మంచిది కాదన్న జేపీ
  • పార్టీ కార్యకర్తలుగానే పని చేస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతుందని వెల్లడి
  • ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్య
ఓ పార్టీకి అనుకూలంగా పనిచేసే వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోవడం సరికాదని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఓటు ప్రాముఖ్యత తెలియజెప్పడం, దొంగ ఓట్లను అడ్డుకోవడంలో భాగంగా.. ‘ఓట్ ఇండియా- సేవ్ డెమొక్రసీ’ పేరుతో లోక్‌సత్తా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోందని ఆయన తెలిపారు. 

‘‘వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోవడం సరికాదు. తక్కువ జీతాలతో ఒక పార్టీ తాత్కాలికంగా నియమించి, వాళ్లను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించుకుంటే పక్షపాతాలకు దారితీస్తుంది. పార్టీ కార్యకర్తలుగా పని చేస్తున్నారు కానీ.. ప్రభుత్వ యంత్రాంగంగా కాదన్న భయం, సందేహం కలుగుతాయి. వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అని అన్నారు.

‘‘మనం దేశంలో సంప్రదాయం ఏంటంటే.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల ప్రక్రియలో వాడుకుంటున్నాం. అంతే తప్ప మిగతా యంత్రాంగాన్ని ఉపయోగించడం లేదు. ఆ సంప్రదాయానికే కట్టుబడి, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటే.. ఈ అపోహలకు ఆస్కారం తగ్గుతుంది” అని జయప్రకాశ్ నారాయణ వివరించారు. 

‘‘అలా కాకుండా తాత్కాలికంగా నియమించుకున్న, రేపు ఉంటారో లేదో తెలియని వాళ్లు, మీకు అనుకూలంగా ఉన్న వాళ్లు.. ప్రజాసేవకులుగా ఉండకపోతే.. వారు నిజంగా మంచి చేసినా చెడు చేసినట్లే కనిపిస్తుంది. తాటి చెట్టు కింద పాలు తాగినా కల్లు అనే అనుకుంటారు. ఇలాంటి ప్రయత్నాలు ప్రభుత్వానికి, ఆ ఉద్యోగులకూ మంచిది కాదు’’ 

‘‘పోలింగ్ బూత్ బయట ఎన్ని అక్రమాలు జరుగుతాయో, ఓట్ల కొనుగోళ్లు జరుగుతాయో మనందరికీ తెలుసు అవన్నీ. పోలింగ్ బూత్‌ వరకు వచ్చాక.. ప్రశాంతంగా, పద్ధతి ప్రకారం ఓటింగ్ జరుగుతుందన్నది నమ్మకం. ప్రశాంతంగా అధికారం మారుతుందని విశ్వాసం. ఆ విశ్వాసం కూడా లేకపోతే ప్రజాస్వామ్యం నాశనమవుతుంది” అని చెప్పారు.


More Telugu News