క్రెడిట్ కార్డులను తెగ గీకేస్తున్నారు.. రికార్డు స్థాయిలో వినియోగం!

  • రూ.2 లక్షల  కోట్లు దాటిన క్రెడిట్ కార్డుల వినియోగం
  • ఏడాది కాలంలో 30 శాతం అధికం
  • అయినా బ్యాంకుల రుణాల్లో క్రెడిట్ కార్డు రుణాలు 1.4 శాతమే
దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం శరవేగంగా పెరిగిపోతోంది. క్రెడిట్ కార్డులను వినియోగించే వారు పెరుగుతున్నారు. బ్యాంకుల రుణాలతో పోలిస్తే క్రెడిట్ కార్డుల రుణాలు ఏడాది కాలంలో 30 శాతం పెరిగినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆర్ బీఐ గణాంకాల ప్రకారం.. క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ (బకాయిలు/బ్యాంకులకు తిరిగి రావాల్సిన మొత్తం) మొదటి సారి రూ.2,00,258 కోట్లకు ఏప్రిల్ లో చేరింది. 2022 ఏప్రిల్ నుంచి చూస్తే ఇది 29.7 శాతం అధికం.

అయితే, దీనిపై బ్యాంకులు ఆందోళన చెందడం లేదు. క్రెడిట్ కార్డులపై ఉన్న బకాయిలు చాలా స్వల్ప మొత్తమని చెబుతున్నాయి. క్రెడిట్ కార్డులపై బకాయిల మొత్తం పెరిగిపోవడం వెనుక కస్టమర్లు చెల్లింపులు చేయకపోవడం కాదని, వారి వినియోగం పెరగడమేనని పేర్కొంటున్నాయి. మొత్తం బ్యాంకు రుణాల్లో క్రెడిట్ కార్డుల వాటా ఇప్పటికీ 1.4 శాతమే ఉండడంతో ఆందోళన అవసరం లేదన్నది బ్యాంకుల అభిప్రాయంగా ఉంది. సాధారణంగా క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడాన్ని వినియోగదారుల్లో విశ్వాసం పెరగడానికి సూచికగా పరిగణిస్తుంటారు. 

సాధారణంగా క్రెడిట్ కార్డులను బ్యాంకులు మంచి క్రెడిట్ స్కోరు ఉన్న కస్టమర్లకే జారీ చేస్తుంటాయి. ఇప్పటికీ మన దేశంలో క్రెడిట్ కార్డుల విస్తరణ ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉంది. మన దేశ జనాభాలో 5 శాతంలోపే క్రెడిట్ కార్డు కలిగి ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇదే అత్యంత తక్కువ.


More Telugu News