ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై ప్రయాణికులు.. మరో ప్లాట్ ఫామ్ పైకి వచ్చి వెళ్లిపోయిన రైలు

  • కలబురగి రైల్వే స్టేషన్ సిబ్బంది నిర్వాకం.. ప్రయాణికుల అగచాట్లు
  • ప్లాట్ ఫాం నెంబర్ అనౌన్స్ చేయకపోవడంతో రైలు ఎక్కలేకపోయిన ప్యాసింజర్లు
  • ప్యాసింజర్ల ఫిర్యాదుతో విచారణకు ఆదేశించిన రైల్వే ఉన్నతాధికారులు
‘దయచేసి వినండి.. సికింద్రాబాద్ వెళ్లవలసిన ఎక్స్ ప్రెస్ మరికొద్దిసేపట్లో ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పైకి రానున్నది..’ అంటూ రైల్వే స్టేషన్లలో అనౌన్స్ మెంట్ వినబడుతూనే ప్రయాణికులు అలర్ట్ అవుతారు. సదరు ప్లాట్ ఫామ్ పైకి వెళ్లి రైలు కోసం ఎదురుచూస్తారు. ఒకవేళ ప్లాట్ ఫాం నెంబర్ అనౌన్స్ చేయకుంటే.. డిస్ ప్లేలో కూడా వేయకుంటే?.. ఆదివారం ఉదయం కర్ణాటకలోని కలబురగి స్టేషన్ లో సికింద్రాబాద్ రావాల్సిన ప్రయాణికులకు ఇదే పరిస్థితి ఎదురైంది. వారంతా ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఎదురుచూస్తుంటే.. రైలు మాత్రం మరో ప్లాట్ ఫామ్ పైకి వచ్చి వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత ఎంక్వైరీలో అడిగితే.. ఆ రైలు ఎప్పుడో వెళ్లిపోయిందిగా అనే సమాధానం రావడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు.

హుబ్బళి - సికింద్రాబాద్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలు షెడ్యూల్ ప్రకారం కలబురగి స్టేషన్ కు ఉదయం ఆరు గంటలకు వస్తుంది. ఈ రైలు నిత్యం ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పైకి వస్తుంది. ఆదివారం ఉదయం ఈ రైలును అందుకోవడానికి వచ్చిన ప్యాసింజర్లు ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పైన ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ రైలు అరగంట ఆలస్యంగా నడుస్తోందని, ఉదయం 6:32 గంటలకు వస్తుందని ఎలక్ట్రానిక్ డిస్ ప్లేలో ప్రదర్శించారు. కానీ ఏ ప్లాట్ ఫామ్ పైకి వస్తుందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఆ తర్వాత కూడా మరో 10 నిమిషాలు ఆలస్యంగా వస్తుందని ప్రకటించినా ప్లాట్ ఫామ్ నెంబర్ చెప్పలేదు.

ప్రయాణికులు ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఎదురుచూస్తూనే ఉన్నారు. చివరకు 6:45 గంటలకు డిస్ ప్లే నుంచి ఈ రైలు పేరును తీసేశారు. కొంతమంది ప్రయాణికులు ఎంక్వైరీలో అడుగగా.. రైలు వచ్చి వెళ్లిపోయిందని చెప్పారు. ఉదయం 6:35 గంటలకు వచ్చి 6:44 గంటలకు వెళ్లిపోయిందని తెలిపారు. దీంతో మండిపడ్డ ప్రయాణికులు.. స్టేషన్ మేనేజర్ ను నిలదీశారు. అంతర్గత కారణాల వల్ల ప్లాట్ ఫామ్ నెంబర్ మార్చాల్సి వచ్చిందని, తమ సిబ్బంది ఈ విషయాన్ని అనౌన్స్ చేయడం మరిచిపోయారని స్టేషన్ మేనేజర్ చెప్పారు.

సికింద్రాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన మేనేజర్.. ఆ తర్వాత వచ్చిన హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ లో వారిని హైదరాబాద్ కు పంపించారు. ఈ అడ్జస్ట్ మెంట్ వల్ల ముందుగా టికెట్ తీసుకున్నా కూడా నిలబడి ప్రయాణించాల్సి వచ్చిందని, సికింద్రాబాద్ వెళ్లాల్సిన తాము హైదరాబాద్ లో దిగాల్సి వచ్చిందని ప్యాసింజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కొంతమంది రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.


More Telugu News