ఢిల్లీలో సినిమాను తలపించిన రాబరీ సీన్.. వీడియో ఇదిగో!

  • కారు ఆపి, గన్స్ తో బెదిరించి క్యాష్ బ్యాగ్ లాక్కెళ్లిన దొంగలు
  • రెండు బైక్ లపై నలుగురు దుండగులు.. ప్రగతి మైదాన్ టన్నెల్ లో ఘటన
  • సీసీటీవీలో రికార్డయిన చోరీ సీన్
  • దొంగల కోసం వెతుకుతున్న పోలీసులు
ఢిల్లీలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. సినిమాను తలపించేలా సాగిన ఈ రాబరీ అంతా క్షణాల్లో పూర్తయింది. బైక్ లపై వచ్చిన దొంగలు కారును ఆపి, గన్స్ తో బెదిరించి క్యాష్ బ్యాగును ఎత్తుకెళ్లారు. ప్రగతి మైదాన్ టన్నెల్ లో జరిగిన ఈ చోరీ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా చేసి, ప్రజలకు రక్షణ కల్పించే సామర్థ్యం ఉన్న మరొకరిని ఎల్జీగా నియమించేందుకు తోడ్పడాలని అన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడం కేంద్రానికి చేతకాకపోతే ఆ బాధ్యతను ఢిల్లీ సర్కారుకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

రెడ్ ఫోర్ట్ ఏరియాకు చెందిన ఓ డెలివరీ ఏజెంట్, అతని సహాయకుడు ఇద్దరూ కలిసి ఓ బ్యాగును గురుగ్రామ్ లో అందజేసేందుకు బయలుదేరారు. బ్యాగ్ లో క్యాష్ ఉండడంతో సేఫ్టీ కోసమని ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు ప్రగతి మైదాన్ టన్నెల్ గుండా వెళుతుండగా రెండు బైక్ ల మీద వచ్చిన నలుగురు యువకులు కారును ఆపేశారు. తమ బైక్ ను అడ్డంపెట్టి కారును ఆపారు, ఆపై గన్స్ తో బెదిరించి నగదు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. ఇదంతా క్షణాలలో జరిగిపోయింది. టన్నెల్ లో అమర్చిన సెక్యూరిటీ కెమెరాల్లో ఈ సీన్ మొత్తం రికార్డయింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. సదరు డెలివరీ సంస్థ ఉద్యోగుల గురంచి ఆరా తీస్తున్నారు. సంస్థలోని వ్యక్తులు లేదా వారి సహకారంతో వేరేవాళ్లు ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, ఈ అనుమానాన్ని బలపరిచే ఆధారాలు ఏవీ ఇప్పటి వరకు దొరకలేదని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు.


More Telugu News