ఆనంద్ మహీంద్ర ‘మండే’ మోటివేషన్ వీడియో

  • ఎత్తయిన ప్లాట్ ఫామ్ పై నుంచి చిన్నారి కిందకు వచ్చేందుకు బాలుడి సాయం
  • ఇతరులకు సాయం చేస్తే మనకు మేలే జరుగుతుందన్న సందేశం
  • ట్విట్టర్ లో వీడియోని పోస్ట్ చేసిన పారిశ్రామికవేత్త
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రతీ సోమవారం ‘మండే మోటివేషన్’ పేరుతో ఓ వీడియోని ట్విట్టర్ లో పంచుకుంటూ ఉంటారు. సోమవారంతో వారాన్ని ఉత్సాహంగా ప్రారంభించాలన్నది ఆయన ఉద్దేశ్యం. ఈ వారం ఆనంద్ మహీంద్రా తీసుకొచ్చిన వీడియో చూసే వారిని తప్పకుండా లైక్ కొట్టేలా చేస్తుంది. 

ఓ చిన్నారి జంపింగ్ ప్లాట్ ఫామ్ పైకి వెళుతుంది. అది భూమికి మూడు అడుగుల ఎత్తులో ఉంటుంది. కానీ, అక్కడి నుంచి తనంతట తాను దిగలేకపోతోంది. దీంతో ఓ ఏడెనిమిదేళ్ల బాలుడు ఆమెకు సాయం చేశాడు. ప్లాట్ ఫామ్ దగ్గరకు వెళ్లి రెండు కాళ్లు, చేతులూ నేలకు ఆనించి గుర్రం మాదిరిగా ఉంటాడు. దీంతో ఆ చిన్నారి బాలిక బాలుడి నడుముపై కాళ్లు పెట్టి మెల్లిగా కిందకు దిగుతుంది. 

‘‘ఇతరులకు సహాయ హస్తం అందించడం, మీ జట్టుకు అండగా ఉండడం.. ఎప్పుడూ కూడా మీ లక్ష్యాల సాధన విషయంలో మీకు సాయపడుతుంది. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు’’ అని ఆనంద్ మహీంద్రా తాను షేర్ చేసిన వీడియో క్లిప్ కు స్పందించారు.


More Telugu News