తెలుగు ఆడియన్స్ కి చేరువైన మరో మలయాళ నటుడు!
- తెలుగు తెరపై మలయాళం ఆర్టిస్టుల జోరు
- షైన్ టామ్ చాకో .. ఫాహద్ ఫాజిల్ హవా
- త్వరలో తెలుగు తెరపైకి పృథ్వీరాజ్ సుకుమారన్
- సినిమాలతో .. వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటున్న అజూ
ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి ఎక్కువమంది ఆర్టిస్టులు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఫహాద్ ఫాజిల్ .. షైన్ టామ్ చాకో వంటి వారు ప్రేక్షకులకు చేరువైతే, త్వరలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తెలుగు తెరపై కనిపించనున్నాడు. వీరంతా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇప్పుడు ఇదే జాబితాలో మరో మలయాళ నటుడు తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు .. అతనే అజూ వర్గీస్. ఈ పేరు వినగానే ఈ నటుడిని తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టడం కష్టమే. '2018' సినిమాలో టాక్సీ డ్రైవర్ గా వేసిన ఆర్టిస్ట్ అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. '2018' సినిమా కేరళలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కింది. విదేశీ టూరిస్టులను తన టాక్సీలో తీసుకుని వెళ్లే డ్రైవర్ గా అజూ ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో చాలా ట్రాకులు కనిపిస్తాయి. అయినా అజూ ట్రాక్ ను అంత తొందరగా మరిచిపోలేరు . అందుకు కారణం .. సహజమైన ఆయన నటన. ఇక రీసెంట్ గా 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో 'కేరళ క్రైమ్ ఫైల్స్' అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ తో సహా అందుబాటులో ఉంది. ఒక వేశ్యను హత్య చేసిన హంతకుడిని పట్టుకునే కేసు చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ గా అజూ కీలకమైన పాత్రను పోషించాడు. హైట్ కాస్త తక్కువైనా ఆ పాత్రకి ఆయన జీవం పోశాడు. మన కళ్లముందే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా అన్నంత సహజంగా చేశాడు. ఈ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యాడనే చెప్పాలి.