రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో కాళ్లు కోల్పోయిన ఖమ్మం యువకుడు

  • రాజమహేంద్రవరం స్టేషన్‌లో ఆదివారం ఘోర ప్రమాదం
  • లగేజీతో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన యువకుడు
  • ప్రమాదవశాత్తూ కిందపడ్డ యువకుడు, బోగీలు, ప్లా్ట్‌ఫామ్ మధ్య ఇరుక్కుపోయిన కాళ్లు
  • రైలు వెళ్లిపోయే సరికి రెండు కాళ్లూ పూర్తిగా తెగిపోయిన వైనం
  • బాధితుడిని ఆసుపత్రికి తరలించి కుటుంబానికి సమాచారం అందించిన పోలీసులు
కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు తన రెండు కాళ్లూ పొగొట్టుకున్నాడు. రాజమహేంద్రవరం స్టేషన్‌లో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. డి.నరేశ్(26) అనే యువకుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ గా పనిచేసేవాడు. ఎంబీఏ చేయాలనే ఉద్దేశంతో అతడు తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇటీవల అతడికి విశాఖపట్నంలోని ఓ కాలేజీలో సీటు వచ్చింది. 

ఈ క్రమంలో అతడు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. రిజర్వేషన్ దొరక్కపోవడంతో జనరల్ బోగీలోనే రాజమహేంద్రవరం వరకూ వచ్చాడు. అక్కడ ఏసీ టిక్కెట్టు కొనుక్కునేందుకు కిందకు దిగిన అతడు ఆ ఛాన్స్ లేదని తెలిసి మళ్లీ రైలెక్కే ప్రయత్నం చేశాడు. అప్పటికే రైలు కదలడం మొదలెట్టింది. దీంతో, యువకుడు లగేజీతో సహా కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో బోగీలు, పట్టాల మధ్య పడిపోయాడు. అతడి కాళ్లు అక్కడే ఇరుక్కుపోయాయి. ఈలోపు వేగం పుంజుకున్న రైలు ప్లాట్‌ఫామ్ విడిచి వెళ్లేసరికి అతడి రెండు కాళ్లు పూర్తిగా తెగిపోయాయి. పట్టాలపై పడిపోయిన నరేశ్‌ను జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం, బాధితుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.


More Telugu News