తండ్రి వర్సెస్ కూతురు: తన తండ్రి కబ్జా చేసిన భూమిని మున్సిపాలిటికీ ఇచ్చేస్తానన్న ముత్తిరెడ్డి కూతురు

  • స్థలం చుట్టూ ముత్తిరెడ్డి వేయించిన గోడను కూల్చివేసిన భవాని రెడ్డి
  • తన పేరుపై తండ్రి ముత్తిరెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణ
  • తన తండ్రి ఇలాంటి పని చేయాల్సింది కాదంటూ వ్యాఖ్య
  • చేర్యాల ప్రజలను క్షమాపణ కోరుతున్నానని వెల్లడి
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి మధ్య కొనసాగుతున్న వివాదం రచ్చకెక్కింది. సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి భూమిని తన తండ్రి కబ్జా చేశారని, ఆ భూమిని తన పేరుపై తండ్రి ముత్తిరెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది.

పెద్ద చెరువు వద్ద తన పేరిట ఉన్న 1270 గజాల స్థలం చుట్టూ ముత్తిరెడ్డి ఏర్పాటు చేసిన గోడను భవాని రెడ్డి కూల్చేశారు. ఆ స్థలాన్ని కోర్టు ద్వారా చేర్యాల మున్సిపాలిటీకి తిరిగి అప్పగిస్తానని ఆమె ప్రకటించారు. చేర్యాల పెద్ద చెరువు మత్తడి వద్ద తన పేరున రిజిస్ట్రేషన్‌ చేసిన స్థలంలో భవానీ ఈ ప్రకటన చేశారు.

ఎమ్మెల్యేగా ఉంటూ యాదగిరిరెడ్డి ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్‌ చేయడం తప్పు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు రూ.వెయ్యి కోట్ల ఆస్తులున్నాయని. అయినా ఆయన ఇలా చేయడం సరికాదన్నారు. తప్పు జరిగిపోయిందని, క్షమించాలని అన్నారు.  ‘‘నా తండ్రి ఊరి భూమి కబ్జా చేసి నా పేరున రిజిస్ట్రేషన్‌ చేసినందుకు నేను చేర్యాల ప్రజలను క్షమాపణ కోరుతున్నాను’’ అంటూ భవానీ పేర్కొన్నట్లుగా ఉన్న బోర్డును ఆ స్థలంలో పెట్టారు.




More Telugu News