చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తా: అనిల్ కుమార్‌‌కు ఆనం రామనారాయణ రెడ్డి కౌంటర్

  • ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ వైపు తిప్పుకున్నారన్న ఆనం 
  • వాళ్లతో రాజీనామా చేయించి.. తర్వాత తమను అడగాలని వ్యాఖ్య
  • సొంత నేతలపైనా వైసీపీ వాళ్లు విమర్శలు చేస్తున్నారని మండిపాటు
  • బూతుపంచాగాలు వద్దంటూ హితవు
దమ్ముంటే నెల్లూరులో పోటీ చేయాలన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్‌కు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని చెప్పారు. ఒకవేళ పది నియోజకవర్గాల గెలుపు బాధ్యతను చంద్రబాబు అప్పగిస్తే.. ఆ పని కూడా చేస్తానని అన్నారు.

నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘టీడీపీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులను వైసీపీ వైపు తిప్పుకున్నారు. ముందు ఆ ముగ్గురి చేత రాజీనామా చేయించండి. తర్వాత మమ్మల్ని అడగండి” అని స్పష్టం చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామని.. ఇంకా ఏడాది అధికారం ఉన్నా వద్దని అధికార పార్టీ నుంచి బయటకు వచ్చామని అన్నారు.

టీటీపీ నేత నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్రపై అనవసర విమర్శలు సరి కాదని ఆనం అన్నారు. లోకేశ్ యాత్రకు వస్తున్న ఆదరణను చూసి సహించలేకపోతున్నారని విమర్శించారు. ‘‘సొంత నేతలపై కూడా వైసీపీ వాళ్లు విమర్శలు చేస్తున్నారు. మీకు పోటీగా ఉన్నారని నేతల కుటుంబాలను తిడుతున్నారు. బూతుపంచాగాలు వద్దు” అని హితవు పలికారు.

అవినీతి, డ్రగ్స్, అక్రమాలకు నెల్లూరు అడ్డాగా మారిందని ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ‘‘నెల్లూరులోనే నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. అక్కడే రాజకీయం ముగించాలని అనుకుంటున్నా. గతంలో నెల్లూరు, రాపూరు, ఆత్మకూరు, వెంకటగిరి నుంచి పోటీ చేశా. ఆరు సార్లు గెలిచా.. కొన్నిసార్లు ఓడిపోయా. చంద్రబాబు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నా అందుకు సిద్ధంగా ఉన్నా. ఒకవేళ పది నియోజకవర్గాల గెలుపు బాధ్యతను అప్పగించినా.. ఆ పని చేస్తా” అని చెప్పారు.


More Telugu News