పట్టణ పేదలకు అలాంటి పథకం తేవాలని కోరిన మంత్రి కేటీఆర్

  • వచ్చే బడ్జెట్ లో ఇందుకోసం ఓ పథకాన్ని రూపొందించాలని విజ్ఞప్తి
  • పట్టణ జనాభా రోజు రోజుకు పెరుగుతోందని, ఇది సంక్లిష్టంగా మారనుందని వ్యాఖ్య
  • హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు కోరిన కేటీఆర్
గ్రామీణ ఉపాధి హామీ తరహాలో పట్టణ పేదలకు కూడా ఓ పథకం తీసుకు రావాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి విజ్ఞప్తి చేశారు. వచ్చే బడ్జెట్ లో ఇందుకోసం ఓ పథకాన్ని రూపొందించాలన్నారు. ఢిల్లీలో కేటీఆర్ పర్యటన రెండో రోజు కొనసాగింది. తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. పట్టణ జనాభా రోజు రోజుకు పెరుగుతోందని, రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, నగర పాలక సంస్థలకు ఈ వ్యవహారం సంక్లిష్టంగా మారే అవకాశముందన్నారు.

అందుకే గ్రామీణ స్థాయిలో ఉపాధి హామీ పథకం ఉన్నట్లే పట్టణ పేదలకు ఓ పథకం తీసుకు రావాలని కోరారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జాబ్ కార్డులు జారీ చేసి నగరస్థాయిలో వారి సేవలను వినియోగించుకుంటుందన్నారు. అదే సమయంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్ 2 (బీ) పనులకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు ఫేజ్ 1లోని కారిడార్ 3లోని నాగోల్ - ఎల్బీనగర్ మెట్రో విస్తరణకు నిధులు సమకూర్చాలని కోరారు. లింక్ రోడ్లకు, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు, హైదరాబాద్ - వరంగల్ మధ్య వేగవంతమైన రవాణా వ్యవస్థ, శానిటేషన్ హబ్ ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు.


More Telugu News