పాదయాత్రలో జగన్ వారానికి 40 కిమీ నడిస్తే... లోకేశ్ 100 కిమీ నడుస్తున్నాడు: సోమిరెడ్డి

  • సూళ్లూరుపేట నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • యువగళం క్యాంప్ సైట్ లో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి
  • లోకేశ్ ను అనిల్ కుమార్ పప్పు అన్నాడని వెల్లడి
  • లోకేశ్ ఇప్పుడు వైసీపీ నేతల పాలిట సింహస్వప్నం అయ్యాడని వ్యాఖ్యలు
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేడు సూళ్లూరుపేట  నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యువగళం క్యాంప్ సైట్ నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లోకేశ్ వైసీపీ నాయకులకు సింహస్వప్నంలా తయారయ్యాడని పేర్కొన్నారు. 

యువగళానికి లభిస్తున్న ప్రజాదరణతో వైసీపీ నాయకులకు నిద్ర పట్టడంలేదని తెలిపారు. లోకేశ్ వెంట నడుస్తున్న జన ప్రభంజనాన్ని చూసి వైసీపీ నాయకులు జడుసుకుంటున్నారని తెలిపారు. 

"మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేశ్ ను పప్పు అన్నారు. కానీ లోకేశ్ తాను పప్పు కాదు దుర్మార్గుల పాలిట నిప్పు అని రుజువు చేసుకున్నారు. రాయలసీమలో ముగ్గురు మాత్రమే తెలుగుదేశం ఎమ్మెల్యేలున్నారు, లోకేశ్ పాదయాత్ర ఫెయిల్ అవుతుందని కారుకూతలు వైసీపీ నేతలు కూశారు. అయితే ప్రజలు పాదయాత్రను రాయలసీమలో ఘనంగా విజయవంతం చేశారు. రాయలసీమలో పోలీసుల పప్పులేం ఉడకలేదు. 

నాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వారానికి నాలుగు రోజులు విహార యాత్రలా సాగింది. రోజుకు పది కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేశాడు. జగన్ వారానికి 40 కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేస్తే... లోకేశ్ వారానికి వంద కిలోమీటర్లు చేస్తున్నాడు. లోకేశ్ మీలా పి.కె.లను పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేయలేదు. 

నెల్లూరు బ్యారేజ్ ను టీడీపీ 90 శాతం చేసి 10 శాతం వైసీపీ చేతిలో పెడితే, ఆ 10 శాతం పని పూర్తి చేయడానికి మూడున్నర సంవత్సరాలు పట్టింది. సంగం బ్యారేజ్ 70 శాతం టీడీపీ చేసి వైసీపీ చేతికిస్తే ఆ 30 శాతం పనులు చేయడానికి మూడున్నర సంవత్సరాలు పట్టింది. ఎస్ ఎస్ కెనాల్ ఫారెస్టు క్లియరెన్స్ ప్రాబ్లం ఉంటే వైసీపీ రూ.250 కోట్లకు టెండర్స్ పిలిపించి 15 శాతం పని జరిగాక రివర్స్ టెండర్ పేరుతో పనులను మూలన పడేశారు. 

ఈ 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ కు టీడీపీ ఎంత ఖర్చు చేసింది... మీరెంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. టీడీపీ ప్రభుత్వం రూ.60 వేల కోట్లు ఖర్చుపెడితే వైసీపీ ప్రభుత్వం రూ.20 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. నీటిపారుదల శాఖను పడుకోబెట్టారు. వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేసిన మీరా లోకేశ్ గురించి మట్లాడేది. వైసీపీ నాయకులు నెల్లూరు జిల్లాలో కొట్టుకుచస్తున్నారు. ఆ ఫ్రస్టేషన్ తెలుగుదేశం నాయకులపై చూపొద్దు. 

జగన్ గ్రాఫిక్ చేసినట్లు లోకేశ్ చేయటం లేదు. ప్రతి సభలోనూ జనం తండోపతండాలుగా వస్తున్నారు. జగన్ పాదయాత్ర అంతా ఫ్యాషన్ షో. రాయలసీమలో లోకేశ్ చేసింది సాహసయాత్ర. లోకేశ్ పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కారుకూతలు కూస్తున్నాడు. 

లోకేశ్ అమెరికాలో చదివిన విద్యావంతుడు. ఒక ముఖ్యమంత్రికి మనవడు. ఒక ముఖ్యమంత్రికి కొడుకు. మంత్రిగా పనిచేశారు. ఐటీ పెట్టుబడులు తెచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కంపెనీలను తరిమేసింది. వైసీపీ నాయకులు నడిచే సిమెంటు రోడ్లు మొదలుకొని  గ్రామాల్లోని ఎల్ ఈడీ బల్బుల వరకు లోకేశ్ ఒక మార్క్ వేసుకున్నాడు. వైసీపీ నాయకులు గ్రామాలలో స్విచ్ బోర్డులు ఏర్పాటు చేసుకోలేకపోయారు. గ్రామాల్లో ఎల్ఈడీ బల్బులన్నా, సిమెంటు రోడ్లన్నా లోకేశ్ గుర్తుకొస్తాడు.  

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చేతులు తడిపితే మాత్రమే ఇరిగేషన్ నుండి బిల్లులు వస్తున్నాయి. ఒక పెద్ద కాంట్రాక్టర్ ఒక మీడియేటర్ ను ఆశ్రయిస్తే తెలుగుదేశం టైంలో ఆగిపోయిన బిల్లు 30 శాతం లంచం తీసుకుని రిలీజ్ చేసినట్లు తెలిసింది" అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించారు.


More Telugu News