సీఎం సొంత జిల్లాలో పట్టపగలు హత్య దేనికి సంకేతం?: టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి

  • వైసీపీలో ఆధిపత్య పోరులో భాగంగా జరిగిందే శ్రీనివాసులు రెడ్డి హత్య అన్న టీడీపీ నేత 
  • వైసీపీలో ఎవరికి వారే హత్యలు చేసుకుంటూ టీడీపీపై నెపం వేస్తున్నారని ఆగ్రహం
  • శ్రీనివాసులు రెడ్డి హత్యకు, లోకేశ్ పర్యటనకు సంబంధం ఉందా? అని నిలదీత
రాష్ట్రంలో శాంతిభద్రతలు కొరవడితే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారని తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ సొంత జిల్లాలోనే శాంతిభద్రతలు కరవయ్యాయన్నారు. అక్కడ నడిరోడ్డుపై పట్టపగలు హత్య జరగడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో భూదందాలు, ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా జరుగుతున్నాయన్నారు. వైసీపీలో ఎవరికి వారే హత్యలు చేసుకుంటూ నెపం టీడీపీపై తోసేస్తున్నారని ధ్వజమెత్తారు.

భూదాహం ఎక్కువై, ఆధిపత్య పోరులో భాగంగా జరిగిందే శ్రీనివాసులు రెడ్డి హత్య అని అన్నారు. అసలు తమ పార్టీ నేత నారా లోకేశ్ పర్యటనకు, వైసీపీ నేత శ్రీనివాసులు రెడ్డి హత్యకు ఏమైనా సంబంధం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. లోకేశ్ పాదయాత్ర తర్వాతే ఈ హత్య జరిగిందని సీఎం మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు అన్నారు. గతంలో వివేకా హత్య కేసులోను తొలుత బీటెక్ రవిపై ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, ప్రశాంతంగా ప్రజలు జీవించే పరిస్థితి లేదన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలకడం పోలీసులకు పరిపాటిగా మారిందన్నారు. శ్రీనివాసులు రెడ్డి హత్య కేసు దర్యాఫ్తు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు.


More Telugu News