కాంగ్రెస్‌తో చర్చలు చివరి దశకు? రెండు రోజుల్లో ఢిల్లీకి షర్మిల!

  • కాంగ్రెస్ తో షర్మిల టచ్‌లోనే ఉన్నారని ఇప్పటికే స్పష్టం చేసిన మాణిక్ ఠాక్రే
  • షర్మిలతో చర్చల సమాచారం హైకమాండ్ కు చేరవేత
  • కాంగ్రెస్‌లో వైఎస్సార్‌‌టీపీ విలీనమా? కేవలం పొత్తు మాత్రమేనా? అన్నది తేలాలి 
  • కలిసి పని చేయడంపై కాంగ్రెస్ కు షర్మిల షరతులు!
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ తో షర్మిల కలిసి పని చేసే విషయంలో చర్చలు కీలక దశకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరో రెండు రోజుల్లోనే షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారని, కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను షర్మిల కలిశారు. అప్పటి నుంచే కాంగ్రెస్ తో కలిసి పని చేసే విషయంలో షర్మిల చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చర్చలు చివరి దశలో ఉన్నాయని తెలుస్తోంది.

తన వైఎస్సార్‌‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా? లేక కేవలం పొత్తు పెట్టుకుంటారా? అనేది తేలాల్సి ఉందని సమాచారం. అయితే కాంగ్రెస్ తో కలిసి పని చేయడంపై షర్మిల కొన్ని షరతులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. టీపీసీసీలో కీలక బాధ్యతలు ఇవ్వాలని, తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో తను కోరిన వారికి సీట్ల కేటాయింపుపై భరోసా ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇక ఏపీ రాజకీయాల్లో తాను ఇన్వాల్వ్ కాబోనని, తెలంగాణకే పరిమితమవుతానని స్పష్టం చేసినట్లు నేతలు చెబుతున్నారు. 

కాంగ్రెస్ తో షర్మిల టచ్‌లోనే ఉన్నారని నిన్న కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలతో ఠాక్రే భేటీ అయ్యారని, షర్మిలతో ఆఖరి దశలో ఉన్న చర్చలపై రాహుల్ కు వివరించారని తెలుస్తోంది. ఓ క్లారిటీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో షర్మిల సమావేశం అయ్యే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు.


More Telugu News