టైటానిక్ జరిగిన చోటే... ఆశ్చర్యం వేసింది: జలాంతర్గామి మునిగిపోవడంపై కామెరూన్

  • సముద్ర గర్భంలో ప్రయాణించడం పరిపక్వతతో కూడిన కళ, భద్రతా చర్యలు అవసరమని వ్యాఖ్య
  • ఓషన్ గేట్ జలాంతర్గామికి అధునాతన సెన్సార్లు
  • ప్రమాదానికి ముందు అవి పగిలి ఉండవచ్చునని వెల్లడి
  • ఆ వెంటనే విచ్ఛిన్నం కావడంతో అందరూ ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చునని అనుమానం
టైటానిక్ శకలాల సందర్శనకు వెళ్లిన మినీ జలాంతర్గామి టైటాన్ కుప్పకూలడంతో అందులో ప్రయాణించిన ఐదుగురు మృతి చెందడంపై ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ స్పందించారు. టైటానిక్ ఓడ ప్రమాదం జరిగినచోటే ఈ ప్రమాదం జరగడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. సముద్ర గర్భంలో ప్రయాణించడం అనేది ఒక పరిపక్వతతో కూడిన కళ అని, భద్రతాపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సముద్ర అన్వేషకుల బృందంలో ఒకరు తనకు సమాచారం ఇచ్చారన్నారు. తనకు అందిన సమాచారం మేరకు ఒక గంటలోనే ఏం జరిగి ఉంటుందో తాను విశ్లేషించి చూశానన్నారు.

టైటాన్ జలాంతర్గామితో సంబంధాలు తెగిపోయిన దాదాపు గంట తర్వాత ఒక పెద్ద శబ్దం వినిపించిందని, దానిని హైడ్రోఫోన్ ద్వారా విన్నామని, ఆ తర్వాత ట్రాన్స్‌పౌండర్ తో సంబంధాలు తెగిపోయాయన్నారు. జలాంతర్గామి పేలిపోయి ఉంటుందని గ్రహించామని, అందులోని వారు కూడా బతికే అవకాశాలు ఉండవని భావించామన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాళ్లు 3,500 మీటర్ల లోతులో ఉన్నారని, తర్వాత కాసేపటికి 3,800 మీటర్లు అంటే సముద్రం అడుగు భాగానికి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నామన్నారు.

టైటానిక్ ఘోరం జరిగిన చోటే ఈ ఘటన జరగడం తనను ఆశ్చర్యపరిచిందని, ఇదే ప్రాంతంలో భారీ ఐస్ గడ్డ ఉందని, ఓడ దానిని ఢీకొట్టబోతుందని అప్పటి కెప్టెన్ పదేపదే హెచ్చరించాడని, రాత్రి టైటానిక్ ఓడ ఆ భారీ మంచుగడ్డను ఢీకొట్టి ముక్కలై మునిగిపోయిందన్నారు. ఈ కారణంగా వందలమంది మృతి చెందారన్నారు. అలాంటి ప్రమాదకరమైన ప్రాంతంలో అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. ఓషన్ గేట్ మినీ జలాంతర్గామికి అధునాతన సెన్సార్లు ఉన్నాయని, ప్రమాదానికి ముందు పగుళ్లు వచ్చి ఉంటాయన్నారు.

ఆ సమయంలో లోపల ఉన్నవారికి కచ్చితంగా హెచ్చరిక సందేశాలు వచ్చి ఉంటాయని, అప్పుడు వాళ్లు వెంటనే స్పందించి ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడే ప్రయత్నం చేయాలన్నారు. కానీ ఈ లోగానే అది విచ్ఛిన్నం కావడంతో అందరూ ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చునన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన పాల్ హెన్రీ తనకు పాతికేళ్లుగా స్నేహితుడని, ఆయన మృతి విషాదకరమన్నారు.


More Telugu News