ముద్రగడ గారూ.. ఈ లేఖ మీరు రాసిందా? లేక జగన్ ఇచ్చిందా?: బుద్దా వెంకన్న
- ముద్రగడకు బహిరంగ లేఖ రాసిన బుద్దా వెంకన్న
- ప్రతి విషయంలోకి చంద్రబాబును ఎందుకు లాగుతున్నారని మండిపాటు
- జరగని విషయాలను జరిగినట్లు ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ నిలదీత
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయంలోకి చంద్రబాబును ఎందుకు లాగుతారంటూ మండిపడ్డారు. జరగని విషయాలను జరిగినట్లు ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ ప్రశ్నించారు. శుక్రవారం ఈ మేరకు ముద్రగడకు బహిరంగ లేఖ రాశారు.
‘‘ముద్రగడ గారూ.. మీది పొరబాటా లేక గ్రహపాటా? 1995లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారిని 1993-94లో ఎలా కలుస్తారు? ఈ లేఖ మీరు రాసిందా? లేక జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిందా?’’ అని ముద్రగడను బుద్దా వెంకన్న సూటిగా ప్రశ్నించారు.
‘‘1993-94లో పత్తిపాడు ఎమ్మెల్యేగా మీరు, ముఖ్యమంత్రిగా కోట్ల విజయ భాస్కర రెడ్డి ఉన్నారు. మీరు చెబుతున్న కేసులు అప్పుడు మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టినవేనని మరచిపోయారా? దీన్ని చంద్రబాబుకు ఆపాదించడం పొరబాటు కాదా?’’ అని నిలదీశారు.
‘‘ఈ లేఖలతో ఎందుకు జరగని విషయాలను జరిగినట్లు ప్రస్తావిస్తున్నారు. ఎందుకు మీరు చంద్రబాబును ప్రతి విషయంలో లాగుతున్నారు. రాజకీయంగా ఏదన్నా మాట్లాడండి తప్పు లేదు.. కానీ చంద్రబాబుకు కులాన్ని ఆపాదించకండి. ఆయన అన్ని కులాలను సమానంగా చూస్తారు.. చూశారు. సంక్షేమ పధకాలను అమలు చేశారు’’ అని బుద్దా వెంకన్న తన లేఖలో పేర్కొన్నారు.