ప్రజలు నన్నే సీఎం కావాలంటున్నారు.. మీడియా మాత్రం నన్ను ఓ కామెడీలా చూపిస్తోంది: కేఏ పాల్

  • ఏపీ రావణకాష్ఠంగా మారిందన్న కేఏ పాల్
  • 15 సీట్లకు పవన్ కల్యాణ్ అమ్ముడుపోయారని మండిపాటు
  • 100 వాగ్దానాలు చేసిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శ
ఏపీ రావణకాష్ఠంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు తాను సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కానీ మీడియా తనను ఓ కామెడీలా చూపిస్తోందని వాపోయారు. శుక్రవారం మీడియాతో పాల్ మాట్లాడుతూ.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిని కలవడానికి వెళ్లానని.. కానీ ఆయన అక్కడ లేరని చెప్పారు. 

‘‘ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి విడుదల చేసిన ఆడియో చూసి షాక్ అయ్యా. ఆయన్ను కలవడానికి వెళ్లా. ఆయన అక్కడ లేరు. ధర్మవరంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, దాడులు, దోపిడీలు దారుణం. ధర్మవరంలో జనాలు ‘కేతిరెడ్డి వద్దు.. బాబు వద్దు.. మీరు సీఎం కావాలి’’ అని అంటున్నారు’’ అని చెప్పుకొచ్చారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లా 100 మంది బౌన్సర్లతో, చంద్రబాబులా హై సెక్యూరిటీతో తిరగడంలేదని, సింగిల్‌గా వెళ్తున్నానని అన్నారు. 15 సీట్లకు పవన్ కల్యాణ్ అమ్ముడుపోయారని, దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చెయ్యాలని సవాల్ చేశారు. తన ప్రజాశాంతి పార్టీలోకి పవన్ పార్టీని విలీనం చెయ్యాలన్నారు. పవన్ ఓ ప్యాకేజీ స్టార్ అని మండిపడ్డారు. 

కొన్ని మీడియా సంస్థలు తనను ఓ కామెడీలా చూపిస్తున్నాయని కేఏ పాల్ మండిపడ్డారు. అదానీ, అంబానీలతో నార్త్ మీడియాను ప్రధాని మోదీ కొనేశారని ఆరోపించారు. షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం, పవన్ కల్యాణ్ పార్టీ టీడీపీ, బీజేపీలతో విలీనం అన్నారు. ధర్మవరంలో జనాలను చూసి షాక్ అయ్యానని, తాను సీఎం కావాలని అన్నారని చెప్పారు. 100 వాగ్దానాలు చేసిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శలు చేశారు.


More Telugu News