అది కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానం.. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఎక్కువ నిధులే కేటాయించామన్న దేవ్ సిన్హా చౌహాన్
  • జగన్ పాలనలో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం లేదని విమర్శ
  • రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని వ్యాఖ్య
ఏపీకి ప్రత్యేక హోదా అంశం కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానమేనని కేంద్ర టెలి కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి దేవ్ సిన్హా చౌహాన్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా.. వివిధ పథకాలు, అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ ఎక్కువ నిధులే కేటాయించారని చెప్పారు. శుక్రవారం ఎమ్మిగనూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. 

జగన్ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం లేదని కేంద్ర మంత్రి విమర్శించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే ఉందని ఆరోపించారు. ఏపీలో రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని అన్నారు.

కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని, అది మానుకోవాలని హితవు పలికారు. బడ్జెట్ లో ఆదాయం లేకున్నా డబ్బులు పంచడంతో పంజాబ్ ఎదుర్కొన్న పరిస్థితులే కర్ణాటకలో రాబోతున్నాయని చెప్పారు. ఏపీలో కూడా జగన్ పరిస్థితి అదే అని కేంద్ర మంత్రి దేవ్‌సిన్హా పేర్కొన్నారు.


More Telugu News