భారత ప్రధానితో కరచాలనానికి పోటీ పడ్డ అమెరికన్ చట్ట సభ్యులు.. వీడియో

  • కాంగ్రెస్ లో దారి పొడవునా ఘన స్వాగతం
  • ఉత్సాహంగా ప్రతి ఒక్కరినీ పలకరించిన ప్రధాని
  • ప్రధాని ప్రసంగానికి సభ్యుల హర్షాతిరేకాలు
  • భారతీయుల ప్రాతినిధ్యం మరింత పెరగాలన్న ఆకాంక్ష
అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు భారత ప్రధాని నరేంద్ర మోదీతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ప్రధాని గురువారం అమెరికన్ చట్ట సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. సభలోకి వస్తున్న క్రమంలో దారి పొడవునా సభ్యులు నించుని మోదీతో చేతులు కలిపారు. ప్రధాని ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ పలకరించారు. ఏ క్షణంలోనూ ప్రధానిలో ఎనర్జీ తగ్గలేదు. 

అనంతరం కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగానికి సభ్యుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. భారతీయ మూలాలు కలిగిన సంతతి అమెరికాలో గణనీయంగా ఉండడం పల్ల ప్రధాని కొనియాడారు. ‘‘అమెరికాలో లక్షలాది మంది మూలాలు భారత్ తో ముడిపడి ఉన్నాయి. అందులో కొందరు ఈ సభలో ఆసీనులై ఉన్నారు’’ అని ప్రధాని పేర్కొన్నారు.

సభాధ్యక్ష స్థానం పక్కనే కూర్చున్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కమలా హ్యారిస్ సాధించిన గొప్ప విజయాన్ని గుర్తు చేస్తూ.. భారతీయ మూలాలు కలిగి అమెరికా ఉపాధ్యక్ష స్థానాన్ని అలంకరించిన తొలి మహిళగా పేర్కొన్నారు. ‘‘సమోసా కాకస్ ఇప్పుడు ఈ సభలో పరిమళిస్తోంది. ఇది ఇంకా వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. భారతీయ వంటల పూర్తి వైవిధ్యాన్ని ఇక్కడకు తీసుకురావాలి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ చట్ట సభల సభ్యుల బృందాన్ని సమోసా కాకస్ అని పిలుస్తుంటారు. 


More Telugu News