ఖాళీ రోడ్డుపైనే తారు వేస్తాం.. కారు అడ్డముంటే మేమేం చేస్తాం?.. విశాఖలో రోడ్డు పునరుద్ధరణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణి!
- రోడ్డుపై ఉన్న వాహనాల కింద వదిలేసి తారు వేసిన సిబ్బంది
- ద్విచక్ర వాహనాలనూ పక్కకు జరపకుండా వదిలేసిన వైనం
- కాంట్రాక్టర్ తీరుపై మండిపడుతున్న స్థానికులు
రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టే ముందు ఆ రోడ్డును బ్లాక్ చేస్తారు.. పనులు మొదలుపెట్టేముందు ఆ వీధిలో ఉంటున్న వారికి విషయం చెబుతారు. ఇంటిముందు రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలను తీసి పనులు పూర్తయ్యే వరకు వేరేచోట పార్క్ చేసుకోవాలని సూచిస్తారు. కానీ విశాఖపట్నంలో కాంట్రాక్టరు ఇవేవీ పట్టించుకోలేదు. కాంట్రాక్ట్ దక్కింది అంతేచాలని అనుకున్నాడో ఏమో కానీ పనుల్లో అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శించాడు. ఎంత నిర్లక్ష్యమంటే.. ఇంటి ముందున్న స్కూటీని కూడా పక్కకు జరపకుండా, ఆ స్కూటీ ఉన్న చోటును అలాగే వదిలేసి మిగతా చోట తారు వేసి వెళ్లాడు. ఇక కార్ల సంగతి చెప్పనక్కరలేదు.
విశాఖపట్నం అక్కయ్యపాలెంలోని అబిద్ నగర్ లో చోటుచేసుకుందీ ఘటన. రోడ్డు పునరుద్ధరణ పనుల్లో భాగంగా గురువారం తారు వేయడం మొదలుపెట్టిన సిబ్బంది రోడ్డుమీద పార్క్ చేసిన వాహనాలను ముట్టుకోలేదు. వాహనాలు ఉన్నచోటును వదిలేసి మిగతా ప్రాంతంలో తారువేశారు. ఖాళీ రోడ్డుపై తారు వేయడమే తమ పని, రోడ్డుపై వాహనాలను పార్క్ చేస్తే తామేం చేస్తామన్నట్లు వ్యవహరించారు. ఈ అస్తవ్యస్త పనులకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయినా ప్రభుత్వ అధికారులు ఎవరూ ఈ పనులను పర్యవేక్షించలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.