టీ20 క్రికెట్‌లో మరో ప్రపంచ రికార్డు.. అత్యధిక రన్ చేజింగ్‌తో రికార్డుల్లోకి మిడిలెస్సెక్స్

  • ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్‌లో నమోదైన రికార్డు
  • తొలుత బ్యాటింగ్ చేసి 252 పరుగులు చేసిన సర్రే జట్టు
  • మరో 4 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించిన మిడిలెస్సెక్స్ జట్టు
టీ20ల్లో మరో ప్రపంచ రికార్డు నమోదైంది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో మిడిలెస్సెక్స్ జట్టు భారీ టార్గెట్‌ను ఛేదించి గొప్ప రికార్డును నమోదు చేసింది. సర్రేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ విల్ జాక్స్ 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 96 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ కోల్పోగా, లారీ ఎవాన్స్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 85 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

అనంతరం 253 పరుగులు కొండంత లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన మిడిలెస్సెక్స్ జట్టు 19.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ అయిన ఓపెనర్ స్టీఫెన్ ఎస్కినాజ్ 39 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్‌తో 73 పరుగులు చేయగా, జో క్రాక్‌నెల్ 16 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 36, మ్యాక్స్ హోల్డెన్ 35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68, ర్యాన్ హిగిన్స్ 24 బంతుల్లో 6 ఫోర్లు, 2  సిక్సర్లతో 48 పరుగులు చేసి జట్టుకు రికార్డు విజయాన్ని అందించారు. ఫలితంగా టీ20 చరిత్రలో అత్యధిక రన్ చేజింగ్ రికార్డును సొంతం చేసుకుంది.


More Telugu News