ఇక భారత్ లో ఫైటర్ ఇంజిన్ల తయారీ... అమెరికా కంపెనీ జీఈ, హెచ్ఏఎల్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం

  • శక్తిమంతమైన యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీకి పెట్టింది పేరైన జీఈ
  • అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
  • కీలక టెక్నాలజీ భారత్ కు బదలాయించేందుకు అమెరికా అంగీకారం
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అత్యంత కీలక ఒప్పందం కుదిరింది. భారత్ లో యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీకి ఉపకరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించేందుకు అమెరికా దిగ్గజ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) అంగీకరించింది. ఈ మేరకు జీఈ, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. 

ఈ జెట్ ఇంజిన్ల తయారీ సాంకేతికత ప్రధానంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాల వద్ద మాత్రమే ఉంది. ఇప్పుడు తొలిసారి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా... భారత్ కు అందించాలని నిర్ణయించింది. ఇకపై జీఈ తయారు చేసే శక్తిమంతమైన ఎఫ్414 జెట్ ఫైటర్ ఇంజిన్లను భారత్ లో కూడా ఉత్పత్తి చేయనున్నారు. 

దీనిపై జీఈ ఏరోస్పేస్ సీఈవో హెచ్.లారెన్స్ కల్ప్ జూనియర్ మాట్లాడుతూ, ఇది చారిత్రాత్మక ఒప్పందం అని అభివర్ణించారు. భారత్, హెచ్ఏఎల్ తో తమ దీర్ఘకాల భాగస్వామ్యం కారణంగా ఇది సాకారమైందని తెలిపారు. ఇరు దేశాల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు, పరస్పర సహకారం కోసం పాటు పడుతున్న అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీల దార్శనికతలో తాము కూడా భాగం కావడం పట్ల గర్విస్తున్నామని వివరించారు. 

జీఈ తయారుచేసే ఎఫ్414 ఇంజిన్లకు సాటి వచ్చేవి మరేవీ లేవని కల్ప్ జూనియర్ స్పష్టం చేశారు. వీటి ఉత్పాదన ఇరు దేశాలకు ఆర్థిక, జాతీయ భద్రత ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. కాగా, ఈ ఉదయం ప్రధాని మోదీ జీఈ సీఈవోను కలిసి భారత్ లోనూ జెట్ ఫైటర్ ఇంజిన్లను తయారుచేయాలన్న ప్రణాళిక పట్ల అభినందించారు.


More Telugu News