రాష్ట్రంలో దాడులపై హోంమంత్రి ఇప్పటికీ స్పందించకపోవడం దారుణం: సీపీఐ రామకృష్ణ

  • విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
  • దళితులు, మహిళలు, జర్నలిస్టులపై దాడులకు నిరసనగా సమావేశం
  • హాజరైన అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాల నాయకులు
  • గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇస్తామన్న సీపీఐ రామకృష్ణ
విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళితులు, మహిళలు, జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ ఈ సమావేశం చేపట్టారు. ఈ సమావేశానికి అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని వివిధ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేశారు. రౌడీయిజాన్ని అరికట్టి ప్రజలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ, ఏపీలో అఘాయిత్యాలు, దాడులు పెరిగాయని వెల్లడించారు. సోదరిని వేధిస్తున్న వారిని ప్రశ్నించిన బాలుడిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లిని వేధించారని ప్రశ్నిస్తే ఏలూరులో మహిళపై దాడి జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని అన్నారు. 

దాడులపై హోంమంత్రి ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమని రామకృష్ణ మండిపడ్డారు. హోంమంత్రి కనీసం బాధితుల పరామర్శకు కూడా రాలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఘోరాలపై ఈ నెల 26న జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు. త్వరలోనే గవర్నర్ కూడా కలుస్తామని, ఆయనకు కూడా వినతిపత్రం సమర్పిస్తామని వివరించారు.


More Telugu News