భారత్ ఆర్థిక సామర్థ్యానికి నిదర్శనం ఇది: ఆనంద్ మహీంద్రా

  • ఒకేసారి 500 విమానాలకు ఇండిగో ఎయిర్ లైన్స్ ఆర్డర్
  • ఇది నియంత్రణల్లేని ఆకాంక్ష, ఆశయాలకు నిదర్శనమన్న ఆనంద్ మహీంద్రా
  • భారత్ అసలైన ఆర్థిక సామర్థ్యాలపై నడుస్తోందంటూ ట్వీట్
ఇండిగో పేరుతో ఎయిర్ లైన్స్ సేవలు అందించే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ సంస్థ ఏకంగా 500 ఎయిర్ బస్ ఏ320 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ప్రపంచ ఎయిర్ లైన్స్ చరిత్రలో ఒక సంస్థ ఒకే విడత ఇన్ని విమానాలకు ఆర్డర్ ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన ఇండిగో సంస్థకు తాజాగా ఇచ్చిన విమానాలు కూడా వచ్చి చేరితే మొత్తం విమానాలు 1330కి చేరతాయి. దేశ ఎయిర్ లైన్స్ మార్కెట్లో 60 శాతానికి పైగా వాటాతో ఇండిగో మొదటి స్థానంలో ఉండడం గమనార్హం.

దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, ట్విట్టర్ లో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ‘‘నియంత్రణ లేని ఆకాంక్ష, ఆశయం. ఎంతో స్ఫూర్తినీయం. వీటన్నింటి కంటే భారత్ లో విమాన ప్రయాణం ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో వృద్ధి చెందుతోంది. అంతిమంగా భారత్ తన అసలైన ఆర్థిక సామర్థ్యాలతో ముందుకు సాగుతోందన్న సంకేతం ఇస్తోంది’’ అంటూ ఆనంద్ మహీంద్రా తన పోస్ట్ లో పేర్కొన్నారు. 

దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య గత ఏడాది కాలంలో శరవేగంగా పెరిగింది. కరోనా కారణంగా మధ్యలో రెండేళ్ల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకున్న వారు ఇప్పుడు పర్యటనలకు మొగ్గు చూపిస్తున్నారు. పైగా ప్రజల ఆర్థిక సామర్థ్యాల్లో మెరుగుదలతో విమాన ప్రయాణాల వైపు మొగ్గు చూపించే వారు పెరుగుతున్నారు. ఇవన్నీ మన దేశ ఎయిర్ లైన్స్ మార్కెట్ కు కలిసొస్తోంది.


More Telugu News