వెస్టిండీస్ టెస్ట్ టూర్ లో ఆసక్తికరమైన మార్పులు ఉంటాయా?

  • సీనియర్ల నుంచి కరవైన మెరుగైన ప్రదర్శన
  • గాయాలతో ముగ్గురు కీలక ఆటగాళ్ల దూరం
  • దీంతో కొత్త వారికి చోటు దక్కే అవకాశం
వచ్చే నెల రెండో వారంలో టీమిండియా వెస్టిండీస్ పర్యటన మొదలు కానుంది. రెండు దేశాల జట్ల మధ్య రెండు టెస్ట్ లు జరగనున్నాయి. వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ విషయమై ఆటగాళ్ల ఎంపిక పట్ల ఆసక్తి నెలకొంది. వచ్చే వారంలోనే బీసీసీఐ సెలక్టర్లు దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో వెస్టిండీస్ టూర్ పై ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వొచ్చన్న వార్తలు వినిపించాయి. కానీ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడం లేదన్నది తాజా సమాచారం.

కాకపోతే ఆటగాళ్ల విషయంలో కొన్ని మార్పులకు అవకాశం లేకపోలేదు. మూడో ఎడిషన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా భారత్ తొలుత వెస్టిండీస్ తో తలపడుతుండడంతో దీనికి ప్రాధాన్యం నెలకొంది. గత రెండు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లకు ఫైనల్ కు చేరిన భారత్ కప్పు గెలవడంలో విఫలమైంది. దీంతో మూడో ఎడిషన్ పై బీసీసీఐ దృష్టి పెట్టింది. చటేశ్వర్ పుజారా మరోసారి విఫలం అయ్యాడు. అజింక్య రహానే ఒక్కడే ఇటీవలి టెస్ట్ ఫైనల్ లో రాణించగా.. 35 ఏళ్ల వయసులో ఉన్న అతడ్ని ఎంతకాలం పాటు 5వ నంబర్ లో పంపిస్తారన్నది సందేహమే. విరాట్ కోహ్లీ నుంచి కూడా మంచి ప్రదర్శన లేదు. 

మరోవైపు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇంకా గాయాల నుంచి కోలుకోలేదు. దీంతో సెలక్టర్లు కొత్త వారికి చోటు ఇవ్వొచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్, అభిమన్యు ఈశ్వరన్ లో ముగ్గురికి చోటు దక్కొచ్చని భావిస్తున్నారు. టీమిండియా కనీసం ముగ్గురు కొత్త వారికి వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ లో చోటు కల్పించాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం అభిప్రాయపడ్డాడు. అలాగే ఫాస్ట్ బౌలర్లకూ అవకాశం ఇవ్వాలన్నాడు.


More Telugu News