భట్టిని కలిసిన పొంగులేటి.. కేసీఆర్ ను ఓడించడానికి నాలుగు మెట్లు దిగుతానని వ్యాఖ్య

  • కాంగ్రెస్ లో చేరే విషయంలో పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్న పొంగులేటి
  • మాయ మాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శ
  • అమరవీరులను కేసీఆర్ ఆదుకోలేదని మండిపాటు
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సర్వం సిద్ధమయింది. నిన్ననే వీరితో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరిపి లైన్ క్లియర్ చేశారు. ఈ క్రమంలో పాదయాత్ర చేస్తున్న మల్లు భట్టివిక్రమార్కను పొంగులేటి కలిశారు. రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీలో పరిణామాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ...  తాను కాంగ్రెస్ చేరే విషయంలో పెద్దలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికి పంపించేందుకు నాలుగు మెట్లు దిగతామని అన్నారు. మాయ మాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ఆదుకోలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను, వ్యవస్థలను, హామీలను గాలికొదిలేశారని అన్నారు.


More Telugu News