పాకిస్థాన్‌ను మట్టి కరిపించిన భారత జట్టు

  • శాఫ్ ఫుట్ బాల్ కప్ లో శుభారంభం
  • 4–0 గోల్స్ తేడాతో గెలిచిన సునీల్ ఛెత్రి సేన
  • హ్యాట్రిక్ గోల్స్ తో హీరోగా నిలిచిన ఛెత్రి
దక్షిణాసియా ఫుట్ బాల్ సమాఖ్య (శాఫ్) చాంపియన్ షిప్ లో ఆతిథ్య భారత్ శుభారంభం చేసింది. కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి హ్యాట్రిక్‌ గోల్స్‌తో చెలరేగడంతో బెంగళూరులో బుధవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–0తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టి కరిపించింది. దిగ్గజ ఆటగాడు ఛెత్రి 10, 16, 74వ నిమిషాల్లో మూడో గోల్స్ తో హ్యాట్రిక్ నమోదు చేయగా.. ఉదాంత సింగ్‌ 81వ నిమిషంలో భారత్ కు నాలుగో గోల్‌ అందించాడు. మరోవైపు భారత డిఫెన్స్‌ ను ఛేదించలేకపోయిన పాక్ చేతులెత్తేసింది. ఒక్క గోల్ కూడా కొట్టకుండా చిత్తుగా ఓడిపోయింది.

ఇక, ఈ మ్యాచ్ లో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన సునీల్ ఛెత్రి అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 90 గోల్స్ ఖతాలో వేసుకున్నాడు. దాంతో, ఆసియా ఖండం నుంచి అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇరాన్ కు చెందిన అలీ దాయి 109 గోల్స్‌ తో ముందున్నాడు. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఛెత్రి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. పోర్చుగల్ దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో (123) అగ్రస్థానంలో ఉండగా.. అలీ దాయి (109), అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ (103) 2,3వ స్థానాల్లో ఉన్నారు.


More Telugu News