విడాకుల కేసులో కోర్టుపై అసంతృప్తి.. జడ్జీ కారు అద్దాలు పగలగొట్టిన వ్యక్తి
- కేరళలోని పథనంతిట్ట జిల్లా తిరువళ్లా కోర్టులో బుధవారం వెలుగు చూసిన ఘటన
- భార్య దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌కు సంబంధించి కోర్టు తీరుపై భర్త అసంతృప్తి
- న్యాయవాది, జడ్జి కుమ్మక్కై తన గోడు వినిపించుకోలేదని ఆక్రోశం
- న్యాయం జరగలేదంటూ కోర్టు ఆవరణలోని న్యాయమూర్తి కారు అద్దాలు పగలగొట్టిన భర్త
కేరళలోని పథనంతిట్ట జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. విడాకుల కేసులో తనకు న్యాయం జరగలేదని భావించిన ఓ వ్యక్తి న్యాయమూర్తి కారుపై తన ఆక్రోశం ప్రదర్శించాడు. కోర్టు ఆవరణలో నిలిపి ఉంచిన కారు అద్దాలను పగలగొట్టాడు. కారుకు సొట్టలు పడేలా రెచ్చిపోయాడు. తిరువళ్లా కోర్టు వద్ద బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆరేళ్లుగా ఈ కేసుపై కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ‘‘భార్యే అతడిపై విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. అయితే, న్యాయవాది, జడ్జి కుమ్మక్కై తన గోడు సరిగా ఆలకించలేదని అతడు కోపోద్రిక్తుడయ్యాడు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.