గద్దర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా.. షర్మిల భర్త ఒక బ్రాహ్మిణ్: కేఏ పాల్
- కొత్త పార్టీని స్థాపించిన గద్దర్
- గద్దర్ ఇలా చేస్తాడని ఊహించలేదన్న కేఏ పాల్
- షర్మిలది బ్రాహ్మణుల పార్టీ అని వ్యాఖ్య
ప్రజా గాయకుడు గద్దర్ ను ప్రజాశాంతి పార్టీ నుంచి సస్పెండ్ చేశామని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. కొత్త పార్టీ పెడుతున్నట్టు ఢిల్లీలో గద్దర్ ప్రకటించారని... ఆయన ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 5న ప్రజాశాంతి పార్టీలో గద్దర్ చేరారని... ఆ వెంటనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గద్దర్ తో డీల్ కుదుర్చుకున్నారని... దాంతో, గద్దర్ తమ పార్టీకి దూరమయ్యారని అన్నారు. తాను గద్దర్ ఇంటికి వెళ్లినప్పుడు ఆయన భార్య, కొడుకు కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు.
జనాభాలో దొరలు ఒక శాతం, కమ్మవారు 3 శాతం, రెడ్లు 5 శాతం ఉన్నారని... 90 శాతం ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అధికారాన్ని చేపట్టకూడదా? అని పాల్ ప్రశ్నించారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఒక బ్రాహ్మిణ్ అని... కాబట్టి ఆ పార్టీ బ్రాహ్మణుల పార్టీ అని చెప్పారు. షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.