యాషెస్ 2023: ఓడినా దూకుడే.. ‘బజ్ బాల్’పై వెనక్కి తగ్గబోం: బెన్ స్టోక్స్

  • యాషెస్ లో దూకుడుగా ఆడటాన్ని సమర్థించుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్
  • ఆసీస్‌పై ఆధిక్యం ప్రదర్శించేందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నామని వెల్లడి 
  • తొలి టెస్టు ఓటమి బాధించేదేనని, ఆసీస్‌కు కఠిన సవాల్‌ విసురుతామని వ్యాఖ్య
యాషెస్ సిరీస్‌ తొలి టెస్టు మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో రెండు వికెట్ల తేడాతో ఆసీస్‌ గెలిచింది. అయితే తొలి రోజే డిక్లేర్ చేయడం, రెండు ఇన్నింగ్స్ లలోనూ ‘బజ్ బాల్’ గేమ్ పేరుతో దూకుడుగా ఆడటం వల్లే ఇంగ్లండ్ ఓడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. ‘బజ్‌బాల్’ క్రికెట్‌పై వెనుకడుగు వేసే అవకాశం లేదని స్పష్టం చేశాడు. తమ జట్టు అవలంబిస్తున్న దూకుడైన ఆటతీరును కొనసాగిస్తామని వెల్లడించాడు. తొలి టెస్టును చివరి దాకా తీసుకెళ్లినందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు. 

‘‘ఇదొక అద్భుతమైన మ్యాచ్‌. టెస్టు ఆసాంతం అభిమానులను, ప్రేక్షకులను కుర్చీల్లో కూర్చోనీయకుండా చేయడంలో విజయవంతమయ్యాం. ఇలా ఉత్కంఠభరితంగా మ్యాచ్‌లు జరగడంతోనే టెస్టు క్రికెట్‌కు మరీ ముఖ్యంగా యాషెస్‌ సిరీస్‌కు భారీ సంఖ్యలో అభిమానులుగా మారారు’’ అని అన్నాడు.

తొలి టెస్టులో ఓటమి బాధించేదేనని బెన్ స్టోక్స్ చెప్పాడు. కానీ తామ అనుకున్న ఆటతీరును (బజ్‌బాల్ క్రికెట్) మున్ముందు కూడా ప్రదర్శిస్తామని, అదే దూకుడును కొనసాగిస్తామని స్పష్టం చేశాడు. ఆసీస్‌కు కఠిన సవాల్‌ విసురుతామని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరైనదిగానే భావిస్తామని చెప్పాడు.

‘‘తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా డిక్లేర్ చేయడంపై చాలా మంది వ్యాఖ్యలు చేశారు. అయితే ఆసీస్‌పై ఆధిక్యం ప్రదర్శించేందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాం. చివరి 20 నిమిషాల్లో బ్యాటింగ్‌ చేయడం అంత సులువేం కాదు. రూట్‌ లేదా జిమ్మీ వికెట్లు ఎప్పుడు పడతాయో ఎవరికి తెలుసు? అప్పుడు మేం అదే స్కోరు వద్దే ఉండేవాళ్లం’’ అని బెన్‌ స్టోక్స్‌ అభిప్రాయపడ్డాడు.


More Telugu News