రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం: రేవంత్ రెడ్డి

  • కోమటిరెడ్డితో కలిసి పనిచేస్తానంటున్న టీపీసీసీ చీఫ్
  • జూపల్లి చేరికపై కాంగ్రెస్ లో కోమటిరెడ్డి, ఉత్తమ్ అసంతృప్తి
  • తమకు సమాచారం ఇవ్వలేదంటూ ఆగ్రహం
కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీలోని సీనియర్లను అందరినీ కలుపుకుని వెళతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో జూపల్లి, పొంగులేటి చేరికల విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. 

సీనియర్ నేతల అసంతృప్తి నేపథ్యంలో వెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి.. బుధవారం మధ్యాహ్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పనిచేస్తానని రేవంత్ స్పష్టం చేశారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి జూపల్లి, పొంగులేటి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉందని, ఇక్కడి సీనియర్ నేతలు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డిలను సంప్రదించకుండా పార్టీలోకి చేరికలు ఉండవని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. పార్టీలో సీనియర్ నేతలు అందరినీ కలుపుకుని వెళతామని మరోసారి స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి కనీసం 15 ఎంపీ సీట్లు గెలుచుకుని రాహుల్ గాంధీని ప్రధాని సీటులో కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.


More Telugu News