అమిత్ షాపై తిరుపతిలో దాడి జరిగితే చంద్రబాబు చర్యలు తీసుకున్నారా?: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

  • సీబీఐని చంద్రబాబు రాష్ట్రంలోకి అనుమతించలేదన్న వీర్రాజు  
  • ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు చెప్పారని విమర్శ
  • కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు రైల్వే జోన్ ఎందుకు తీసుకురాలేదని ప్రశ్న
ఓవైపు టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న తరుణంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే... సోము వీర్రాజు చంద్రబాబును టార్గెట్ చేశారు. 

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐని చంద్రబాబు రాష్ట్రంలోకి అనుమతించలేదని వీర్రాజు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రంలో పని చేయకూడదని భావించారని విమర్శించారు. అమిత్ షాపై తిరుపతిలో దాడి జరిగితే చంద్రబాబు చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై మాట్లాడటానికి దమ్ముంటే చంద్రబాబును రమ్మనండి అని సవాల్ విసిరారు. 

శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని... ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా వద్దన్నారని... ప్రత్యేక హోదా వద్దని ఎందుకు చెప్పారని మీడియా ప్రతినిధులు ఎవరైనా ఆయనను ఎప్పుడైనా అడిగారా? అని ప్రశ్నించారు. 

పొత్తులపై సోము వీర్రాజు మాట్లాడుతూ... నోటాకు వచ్చే ఓట్లు కూడా బీజేపీకి రావని టీడీపీ నేతలు అంటారని... మళ్లీ బీజేపీనే కావాలని అంటారని ఎద్దేవా చేశారు. పార్టీ హైకమాండ్ పొత్తులపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పారని... అప్పుడెందుకు విశాఖ రైల్వే జోన్ ను తెప్పించలేదని ప్రశ్నించారు. ఐదుగురిని ప్రధానులుగా చేసిన చంద్రబాబుకు రైల్వే జోన్ ఒక వెంట్రుకతో సమానం అని... ఆ పని ఎందుకు చేయలేకపోయారని అన్నారు. చంద్రబాబు తన వద్దకు వస్తే... తానే ఆయనను నేరుగా అడుగుతానని అన్నారు.


More Telugu News