ఒడిశా రైలు ప్రమాద బాధితులను ఆదుకున్న ఊరి అభివృద్ధికి నిధులు

  • రూ.2 కోట్లు మంజూరు చేస్తామంటూ రైల్వే మంత్రి ప్రకటన
  • బహానగా గ్రామాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • గ్రామంలో ఆసుపత్రి విస్తరణ సహా ఇతర అభివృద్ధి పనులకు నిధులు
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత బహానగా గ్రామస్థులు వేగంగా స్పందించి, వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. లేదంటే ప్రాణనష్టం ఇంకా ఎక్కువగా ఉండేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే! ఇప్పుడు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి రైల్వే మంత్రి రూ.2 కోట్ల నిధులు ప్రకటించారు. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.1 కోటి, రైల్వే శాఖ నుంచి మరో కోటి రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

మంగళవారం పూరి జగన్నాథుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.. తర్వాత బహానగా గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పరిస్థితులను పరిశీలించి గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించారు. గ్రామంలో ఆసుపత్రి విస్తరణకు, వివిధ సౌకర్యాల కల్పనకు రైల్వే శాఖ నుంచి రూ.1 కోటి నిధులు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. 

అదేవిధంగా, గ్రామ అభివృద్ధికి తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి మరో కోటి రూపాయలు మంజూరు చేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. కాగా, ఈ నెల 2న జరిగిన రైలు ప్రమాదంలో 292 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇప్పటికీ కొంతమంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.


More Telugu News