అది జరగాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలి: పవన్ కల్యాణ్

  • వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనేదే 
    తన ఉద్దేశం అన్న జనసేన అధినేత
  • చంద్రబాబుతో ఇప్పటికే మూడు సార్లు భేటీ అయ్యానని వెల్లడి
  • తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేసిన పవన్
వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడనివ్వకూడదనేదే తన ఉద్దేశం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఇది జరగాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలని అభిప్రాయడ్డారు. ఈ విషయంలో తన అభిప్రాయం చెప్పానని, ఎన్నికలు దగ్గరయ్యాక దీనిపై మరింత స్పష్టత వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో వారాహి విజయయాత్ర చేస్తున్న పవన్ ’ఏబీఎన్ ఆంధ్రజ్యోతి‘కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల వ్యూహాలపై మాట్లాడారు. ఓటర్లు కులాలపరంగా విడిపోకూడదని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ బీహార్‌కంటే ఘోరంగా తయారైందని విమర్శించారు. 

సీఎం జగన్‌ విచక్షణ, వివేకం లేని వ్యక్తి అని పవన్ దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటి కావాలని అభిప్రాయపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో తాను ఇప్పటికే మూడు సార్లు సమావేశమయ్యానని చెప్పారు. అయితే, ఆ భేటీల్లో ఎన్నికల్లో పంచుకునే సీట్ల గురించి కాకుండా రాష్ట్ర అంశాలపైనే చర్చ జరిగిందని వెల్లడించారు. పొత్తు కుదిరితే ఎన్ని సీట్లు అడుగుతామనేది ఇంతవరకు టీడీపీతో చర్చించలేదని పవన్ చెప్పారు. తెలంగాణలో జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎన్ని సీట్లు అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.


More Telugu News