నేనైతే భారత్ కు వెళ్లను గాక వెళ్లను: పాక్ క్రికెట్ దిగ్గజం మియాందాద్

  • మరోసారి భారత క్రికెట్ పై విషం చిమ్మిన మియాందాద్
  • భారత, పాక్ మధ్య దెబ్బతిన్న క్రికెట్ సంబంధాలు
  • ఐసీసీ ఈవెంట్లలోనే పరస్పరం తలపడుతున్న దాయాదులు
  • భారత జట్టు పాకిస్థాన్ లో ఆడాల్సిందేనన్న మియాందాద్
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం జావెద్ మియాందాద్ ఏళ్ల తరబడి భారత్ పై విషం కక్కుతూనే ఉన్నాడు. పాకిస్థాన్ జట్టుకు ఆడే సమయంలోనూ భారత జట్టుపై ఆగ్రహం వెలిబుచ్చుతుంటే మియాందాద్... రిటైరైన తర్వాత కూడా తన వైఖరి మార్చుకోలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఏదో ఒక అంశంలో అక్కసు వెళ్లగక్కుతుంటాడు. 

తాజాగా, ఐసీసీ వరల్డ్ కప్ అంశంలో మియాందాద్ స్పందించాడు. పాకిస్థాన్ జట్టు వరల్డ్ కప్ సహా మరే ఇతర మ్యాచ్ లు ఆడేందుకు భారత్ కు వెళ్లరాదని పేర్కొన్నాడు. మొదట బీసీసీఐ భారత జట్టును పాకిస్థాన్ లో ఆడేందుకు పంపించాలని, ఆ తర్వాతే పాకిస్థాన్ జట్టు భారత్ లో మ్యాచ్ లు ఆడేందుకు వెళ్లాలని సూచించాడు. ఈ విషయంలో తానే నిర్ణయం తీసుకునేట్టయితే భారత్ కు వెళ్లను గాక వెళ్లను అని కరాఖండిగా చెప్పాడు. అది వరల్డ్ కప్ అయినా సరే తాను వెళ్లనని తెలిపాడు. 

భారత్ తో ఆడేందుకు పాకిస్థాన్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నా... అదే రీతిలో భారత్ మాత్రం పాకిస్థాన్ తో ఆడేందుకు మొగ్గు చూపడంలేదని మియాందాద్ విమర్శించాడు. పాకిస్థాన్ క్రికెట్ పరిధి చాలా విస్తృతమైనదని, పాకిస్థాన్ నాణ్యమైన క్రికెటర్లను తయారుచేస్తోందని, అలాంటప్పుడు భారత్ లో మ్యాచ్ లు ఆడేందుకు వెళ్లకపోయినా పాక్ క్రికెట్ కు వచ్చిన నష్టమేమీ ఉండదని స్పష్టం చేశాడు. 

"ఏ దేశం కూడా ఈ దేశాలే తన పొరుగు దేశాలుగా ఉండాలని నిర్ణయించుకోలేదు. పరస్పర సహకారంతో ముందుకెళ్లడమే అన్ని వేళలా మంచిది. క్రికెట్ ప్రజలను ఏకం చేసే క్రీడ అని నేను ముందు నుంచి చెబుతున్నాను. దేశాల మధ్య నెలకొన్న అపోహలు, అపార్థాలను క్రికెట్ తొలగించగలదు" అని అభిప్రాయపడ్డాడు. 

ఇక, భారత్ జట్టు ఆసియా కప్ ఆడేందుకు పాకిస్థాన్ లో అడుగుపెట్టకపోతే, పాక్ క్రికెట్ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మియాందాద్ పేర్కొన్నాడు.


More Telugu News