మీ దయ ఉంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తా: ప్రజలతో కేటీఆర్

  • ఎల్లారెడ్డిపేటలో పాఠశాల సముదాయ భవనాలను ప్రారంభించిన కేటీఆర్
  • అమెరికాలో ఎక్కడకు వెళ్లినా తెలుగు వారు కలుస్తుంటారన్న మంత్రి
  • తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని వ్యాఖ్య
ప్రజల దయ ఉంటే తాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని, వచ్చి పని చేస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో పాఠశాల సముదాయ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. అమెరికాలో ఎక్కడకు వెళ్లినా మన తెలుగు వారు కలుస్తుంటారన్నారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారన్నారు. విద్యతోనే వికాసం, ఆత్మవిశ్వాసం ఉంటాయన్నారు. ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాల వస్తుందన్నారు. తొమ్మిదేళ్ల క్రితం పరిస్థితులను, ప్రస్తుత పరిస్థితులను ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు, విద్యా దినోత్స‌వం సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యతోనే వికాసం.. విద్యతోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ప్రతి తరగతి గది.. తరగని విజ్ఞాన గని.. ఆ నాలుగు గోడలే.. దేశ భవిష్యత్తుకు మూలస్తంభాలని కేటీఆర్ పేర్కొన్నారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం, గోరంట్యాల గ్రామంలో ''మన ఊరు - మన బడి'' కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను కేటీఆర్  ప్రారంభించారు.

వరుస ట్వీట్‌లు

'మిగతా రాష్ట్రాల్లో డ్రాప్-అవుట్ లు..   తెలంగాణలో మాత్రం డ్రాప్-ఇన్ లు.. కేవలం ఒక్క ఏడాదే.. ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల వైపు..  కొత్తగా లక్షకు పైగా విద్యార్థుల బలమైన అడుగులు
వ్యవసాయంలోనే కాదు.. విద్యారంగంలోనూ వలసలు వాపస్.. రేపటి పౌరుల భవిష్యత్తుపైనే ప్రభుత్వ ఫోకస్... దేశ చరిత్రలోనే అత్యధిక గురుకులాలు... కార్పొరేట్ స్థాయి ప్రమాణాలకు చిరునామాలు, ఒక్కో విద్యార్థిపై రూ.లక్షా 25 వేల వ్యయం, భారంగా కాదు.. బాధ్యతగా భావిస్తోంది మన ప్రభుత్వం' అని ట్వీట్ చేశారు.

మన ఊరు మన బడి పేరుతో సమూల మార్పులు చేశామని, 26 వేల పాఠశాలలకు సరికొత్త రూపు రేఖలు వచ్చాయని మరో ట్వీట్ లో పేర్కొన్నారు. ఊరు మారింది.. బడులు మారాయని మూడో ట్వీట్ లో పేర్కొన్నారు.

KTR

More Telugu News