వ్యాపారాలను విశాఖ నుంచి హైదరాబాద్ కు తరలించాలనుకుంటున్న వైసీపీ ఎంపీ?

  • ఇటీవల కిడ్నాప్ కు గురైన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు
  • వ్యాపారాలు, రాజకీయాలు రెండూ విశాఖలో చేయలేనన్న ఎంపీ
  • వ్యాపారాలకు అనుమతులు పొందడంలో కూడా జాప్యం జరుగుతోందని వ్యాఖ్య
విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీలను ఇటీవల కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. రౌడీషీటర్ హేమంత్ మరో ఐదుగురితో కలిసి డబ్బు కోసం వీరిని కిడ్నాప్ చేశాడు. ఈ నేపథ్యంలో ఎంవీవీ సత్యనారాయణ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన వ్యాపారాలన్నింటినీ ఏపీ నుంచి తెలంగాణకు తరలించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద ఆయన ప్రస్తావిస్తున్నారు. తనను ఇక్కడ వ్యాపారం చేయనీయడం లేదని... తాను హైదరాబాద్ కు వెళ్లిపోతానని ఆయన చెపుతున్నారు. ఆయన నిర్ణయం వైసీసీలో కలకలం రేపుతోంది. విశాఖను రాజధానిగా చేయాలని జగన్ భావిస్తున్న తరుణంలో ఎంవీవీ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

ఏపీలో రాజకీయాలు, వ్యాపారాలు రెండూ ఒకేసారి కొనసాగించడం కష్టంగా ఉందని సత్యనారాయణ అన్నారు. వ్యాపారరీత్యా ఇక్కడ అవసరమైన అనుమతులు పొందడంలో కూడా జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు. రాజకీయాలు విశాఖలో, వ్యాపారాలు హైదరాబాద్ లో చేద్దామనుకుంటున్నానని చెప్పారు. అధికార పార్టీలో ఉండటం వల్ల తనపై అసత్య ప్రచారాలు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. ఎవరెవరో ఏదేదో అంటుంటే బాధ కలుగుతోందని చెప్పారు. కిడ్నాపర్లకు శిక్ష పడేంత వరకు న్యాయపరంగా ఎంత చేయాలో అంతా చేస్తానని తెలిపారు.


More Telugu News