గుండెపోటు భయంతో యువకుడి ఆత్మహత్య.. రంగారెడ్డి జిల్లాలో విషాదం

  • చెందిప్ప గ్రామంలో ఇంజనీరింగ్ విద్యార్థి హరికృష్ణ బలవన్మరణం
  • మిస్ యూ మమ్మీ, డాడీ అంటూ సూసైడ్ లెటర్
  • పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్న యువకుడు
గుండెల్లో నొప్పి తరచూ వేధిస్తుండడంతో భయాందోళనలకు గురైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుండెపోటు వస్తుందేమోననే టెన్షన్ తో చెట్టుకు ఉరివేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం చెందిప్పలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ చదువుతున్న యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో చెందిప్ప గ్రామంలో విషాదం అలముకుంది. 

పోలీసుల వివరాల ప్రకారం.. చెందిప్ప గ్రామానికి చెందిన విద్యాసాగర్, లలిత దంపతులకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు హరికృష్ణ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మూడేండ్ల క్రితం గుండెనొప్పి రాగా హరికృష్ణ స్థానిక ఆసుపత్రిలో చూపించుకున్నాడు. మందులు వాడిన తర్వాత తగ్గిపోయింది. అయితే, తరచూ గుండెనొప్పి వేధిస్తుండేది. ఆదివారం నొప్పి ఎక్కువగా ఉండడంతో మెడికల్ షాపుకు వెళ్లి మందులు తెచ్చుకున్నాడు.

మందులు వేసుకున్నాక కూడా నొప్పి తగ్గకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాక తన గదిలోకి వెళ్లి సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకున్నాడు. ఇంట్లో అందరూ నిద్రించాక పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. తెల్లవారాక చెట్టుకు వేలాడుతున్న కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సూసైడ్ నోట్ లో..
‘‘మిస్ యూ డాడీ, మిస్ యూ మమ్మీ, మిస్ యూ అన్నా.. నాకు గుండెపోటు వస్తోంది. చిన్న వయసులోనే చనిపోతున్నందుకు సారీ’’ అంటూ కుటుంబ సభ్యులను ఉద్దేశించి హరికృష్ణ సూసైడ్ నోట్ రాశాడు.


More Telugu News