గీతా ప్రెస్‌కు శాంతి బహుమతి అంటే.. గాడ్సేకు ఇచ్చినట్టే.. జైరాం రమేశ్

  • కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం
  • గాాంధీతో విభేదాలున్న గీతా ప్రెస్‌కు అవార్డేంటని కాంగ్రెస్ నిలదీత
  • కాంగ్రెస్ హిందుత్వాన్ని అసహ్యించుకునే పార్టీ అన్న బీజేపీ
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రకటించడం కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని జ్యూరీ గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతిని ప్రకటించడాన్ని కాంగ్రెస్ ఆక్షేపించింది. ‘పరిహాసం’గా కొట్టిపడేసింది. 

గీతా ప్రెస్‌కు శాంతి బహుమతి ఇవ్వడమంటే హిందుత్వవాది వీడీ సావర్కర్, గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేకు ఇవ్వడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ దుమ్మెత్తి పోశారు. గీతా ప్రెస్‌పై 2015లలో జర్నలిస్ట్ అక్షయ ముకుల్ రాసిన పుస్తకాన్ని ప్రస్తావిస్తూ.. గాంధీ, గీతా ప్రెస్ మధ్య విభేదాలు ఉన్నట్టు అందులో రాశారని, అలాంటి సంస్థకు గాంధీ శాంతి బహుమతి ఏంటని నిలదీశారు.

కాంగ్రెస్ విమర్శలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా తీవ్ర పదజాలంతో స్పందించారు. దేశ నాగరికత విలువలు, గొప్ప వారసత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యుద్ధం ప్రారంభించిందని ట్వీట్ చేశారు. ఇతర బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హిందుత్వాన్ని అసహ్యించుకునే పార్టీ అని ధ్వజమెత్తారు. రామమందిర నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.


More Telugu News