న్యూజెర్సీలో ఇంటి అద్దె భరించలేక విమానంలో ఆఫీస్‌కు అప్-అండ్ డౌన్!

  • న్యూజెర్సీ అడ్వర్టైజింగ్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ అవకాశం
  • రెండు నెలల పాటు వారానికి ఒకరోజు మాత్రమే ఆఫీస్
  • న్యూజెర్సీలో అద్దెకు బదులు విమాన ప్రయాణాన్ని ఎంచుకున్న మహిళ
ఇంటి అద్దెలు భరించలేక కాస్త తక్కువ అద్దె కలిగిన దూర ప్రాంతాల్లో నివసిస్తూ... బస్సు, మెట్రో రైళ్లలో ప్రయాణించడం రోజూ చూసేదే.. చేసేదే! బస్సుల్లో, రైళ్లలో గంటల తరబడి ప్రయాణించి కార్యాలయాలకు వస్తుంటారు. కానీ ఇంటి అద్దె భరించలేక విమాన ప్రయాణం చేసిన వారి గురించి విన్నారా? అమెరికాలో ఓ యువతి ఇంటి అద్దెను భరించలేక వందల కిలోమీటర్ల దూరం విమానంలో ప్రయాణిస్తోంది. అయితే ప్రతి రోజు మాత్రం కాదు.. వారానికి ఒకరోజు!

సౌత్ కరోలినాలోని కార్లెస్టన్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల సోఫియా యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో చదువుతోంది. ఆమెకు న్యూజెర్సీలోని ఒగిలివ్ హెల్త్ అనే అడ్వర్టైజింగ్ కంపెనీలో సమ్మర్ ఇంటర్న్ షిప్ చేసే అవకాశం వచ్చింది. న్యూజెర్సీలో ఇంటి అద్దెలు చాలా ఎక్కువ. శివారు ప్రాంతాల్లో ఉండాలన్నా కనీసం నెలకు 3,400 డాలర్లు చెల్లించాలి. అయితే రెండు నెలల తన ఇంటర్న్ షిప్ కాలంలో సోఫియా వారానికి ఒకరోజే ఆఫీస్ కు వెళ్లాలట. దీంతో అద్దె భరించలేక వారానికి ఒకరోజు విమానంలో వెళ్తోంది.

కార్లెస్టన్ నుండి న్యూజెర్సీ 700 మైళ్ల దూరంలో ఉంది. ఈ రెండు నెలల కాలంలో ఆమె 8 రోజులు ఆఫీస్ కు వెళ్లాలి. విమానం, క్యాబ్ ఖర్చు అంతా కలిపి 2,250 డాలర్లు మాత్రమే అవుతోందట. దీంతో అద్దెకు ఉండటం బదులు ప్రయాణం చేయడం మంచిదని భావించింది. కానీ ఉదయం మూడు గంటలకే లేచి, ఆఫీస్ కు వెళ్లి, సాయంత్రం వచ్చేసరికి రాత్రి అవుతోంది. ఆమె తీరుకు నెటిజన్లు అవాక్కవుతున్నారు.


More Telugu News