పని చేయలేకుంటే తప్పుకోండి.. పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక
- పని చేయని నేతలకు పార్టీలో స్థానం ఉండదని స్పష్టం చేసిన చంద్రబాబు
- వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసేలా సిద్ధంగా ఉండాలని సూచన
- తెలుగుదేశం మినీ మేనిఫెస్టోపై ఇంటింటా చర్చ జరగేలా చేయాలని దిశానిర్దేశం
- దసరా రోజున మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు వెల్లడి
పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. పని చేయని నేతలకు పార్టీలో స్థానం ఉండదని స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘పార్టీ కార్యక్రమాల విషయంలో అలక్ష్యం వద్దు. పని చేయలేని వారుంటే ఇప్పుడే తప్పుకోవాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ నాయకులను చూసుకుంటాం’’ అని తేల్చిచెప్పారు.
‘‘నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడడం లేదని అనుకోవద్దు. పని చేయకుంటే గట్టిగానే చర్యలు తీసుకుంటాను. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసేలా నాయకులు సిద్ధంగా ఉండాలి. గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’’ అని సూచించారు. తెలుగుదేశం మినీ మేనిఫెస్టోపై ఇంటింటా చర్చ జరగాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజల మనోభావాల ప్రకారం సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.
మరోవైపు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టేలా కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీ నేతలకు అగ్రపీఠం వేసింది తెలుగుదేశమే అని గుర్తుచేశారు. దసరా రోజున విడుదల చేయనున్న మేనిఫెస్టోలో బీసీల కోసం ఏం చేయబోతున్నామో చెబుతామని వెల్లడించారు. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం ఏదో బటన్ నొక్కుతానంటోందని ఎద్దేవా చేశారు. బటన్ నొక్కే వ్యవస్థని తెచ్చిందే తెలుగుదేశం అని గుర్తుచేశారు.