ఏపీలో స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు.. వైసీపీ మళ్లీ గెలవకూడదు: చంద్రబాబు

  • ఏపీలో ఉండలేమని అధికార పార్టీ ఎంపీ హైదరాబాద్ కు వెళ్లిపోయారన్న చంద్రబాబు
  • గంజాయి వాడకాన్ని ప్రోత్సహిస్తూ.. నేరాలను సమర్థించే సీఎంను ఏమనాలని ప్రశ్న
  • ఏపీలో గన్ చూపించి ఆస్తులు రాయించుకునే పరిస్థితి ఉందని ఆందోళన
  • ఆడవాళ్లు రాజకీయాల్లో చురుకుగా ఉంటే వేధిస్తున్నారని ఆవేదన
రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా బతకాలంటే వైసీపీ మళ్లీ గెలవకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారు. విశాఖలో అక్రమాలకు భయపడి.. ఏపీలో ఉండలేమని ఎంపీ ఎంవీవీ తన ఆఫీసును హైదరాబాదుకు మార్చుకుని వెళ్లిపోయారు’’ అని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

రాష్ట్రంలో గంజాయి వాడకాన్ని ప్రోత్సహిస్తూ.. నేరాలను సమర్థించే ముఖ్యమంత్రిని ఏమనాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గంజాయి తాగే వెధవలకు తల్లీ, చెల్లీ తేడా తెలియదు. అలాంటి వాళ్లను రోడ్ల మీదకు వదిలేస్తారా?’’ అని ప్రశ్నించారు. ఏపీలో గన్ చూపించి ఆస్తులు రాయించుకునే పరిస్థితి ఉందని, అవినీతి, అసమర్థ, నేరస్తుల పాలన కొనసాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. 

‘‘మచిలీపట్నంలో ఓ ఎస్సీ యువతికి మత్తు మందిచ్చి వైసీపీ నేత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ నేతను కాపాడేందుకు మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని ప్రయత్నిస్తున్నారు’’ అని ఆరోపించారు. ఏపీలో ఎవ్వరూ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితే లేదని అన్నారు. ఆడవాళ్లు రాజకీయాల్లో చురుకుగా ఉంటే కించపరుస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే తెలుగుదేశం భయపడబోదని స్పష్టం చేశారు.

తిరుమల శ్రీవాణి ట్రస్టు అంశంపైనా చంద్రబాబు స్పందించారు. ‘‘తిరుమల వెంకన్నకు అపచారం తలపెడుతున్నారు. శ్రీవాణి ట్రస్టు నిర్వాహకులు ఎవరు? శ్రీవాణి టికెట్లకు రసీదులు ఇవ్వడం లేదు. డబ్బులు ఏమవుతున్నాయి? తిరుపతి వెంకన్నకు అపచారం చేస్తే పుట్టగతులు ఉండవు. వచ్చే జన్మలో కాదు.. ఈ జన్మలోనే శిక్ష పడుతుంది’’ అని హెచ్చరించారు.


More Telugu News