విశాఖలో క్రికెట్ ఆడేందుకు వెళ్లి యువ న్యాయవాది మృతి

  • నగరంలో ఈ నెల 16న న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్
  • జింక మైదానంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన లాయర్ మణికంఠనాయుడు(26)
  • మైదానం నుంచి బయటకు వస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిన వైనం
  • 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి మణికంఠ అప్పటికే మరణించినట్టు ప్రకటన
  • మణికంఠకు గుండె సంబంధిత వ్యాధి ఉందన్న సహచర న్యాయవాది 
క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ఓ యువ న్యాయవాది మైదానం నుంచి బయటకు వస్తూ అకస్మాత్తుగా మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఈ నెల 16న విశాఖ నగరంలో న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్‌లో లాయర్ మణికంఠనాయుడు (26) బీ-టీం తరపున బరిలోకి దిగారు. 

ఆదివారం గాజువాక జింక మైదానంలో మ్యాచ్ పూర్తయిన తరువాత మణికంఠ మైదానం నుంచి బయటకు వస్తూ అనారోగ్యానికి లోనై కింద పడిపోయారు. ఆ తరువాత 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి, మణికంఠ అప్పటికే మృతి చెందినట్టు తేల్చారు. మణికంఠనాయుడికి గుండె వ్యాధి ఉందని, ఈ కారణంతోనే మృతి చెందాడని విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు తెలిపారు.


More Telugu News