ఆదిపురుష్ ట్రోల్స్ పై తొలిసారి స్పందించిన దర్శకుడు ఓం రౌత్

  • ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్
  • ఇటీవల రిలీజైన చిత్రం
  • సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్
  • విమర్శలను తాను పట్టించుకోనున్న ఓం రౌత్
  • కలెక్షన్ల పట్ల సంతోషిస్తున్నట్టు వెల్లడి
  • రామాయణం పూర్తిగా అర్థమైందని ఎవరైనా అంటే వాళ్లు మూర్ఖులేనని వ్యాఖ్యలు
ప్రభాస్, కృతి సనన్ తదితరులు నటించిన ఆదిపురుష్ చిత్రం విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆ చిత్రంపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై దర్శకుడు ఓం రౌత్ తొలిసారిగా స్పందించారు. విమర్శల కంటే కూడా బాక్సాఫీసు వద్ద ఆదిపురుష్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందన్నదే ముఖ్యమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ చిత్రం రాబడుతున్న వసూళ్లతో తాను చాలా సంతోషిస్తున్నానని తెలిపారు. 

ఇక, రామాయణం పూర్తిగా అర్థమైందని చెప్పడం మూర్ఖత్వం కిందికి వస్తుందని ఓం రౌత్  అభిప్రాయపడ్డారు. "తీరుబడిగా కూర్చుని... నాకు ఇందులోని డ్రామా అర్థమైంది అని చెప్పడం తీవ్ర తప్పిదమే అవుతుంది. ఎందుకంటే, రామాయణాన్ని సంపూర్ణ రీతిలో అర్థం చేసుకునే సామర్థ్యం ఎవరికీ లేదని భావిస్తాను. ఒకవేళ ఎవరైనా రామాయణం బాగా అర్థమైందని చెబితే వాళ్లు మూర్ఖుల కిందే లెక్క... లేదా వాళ్లు అబద్ధం చెబుతున్నట్టే భావించాలి. 

రామాయణంలో నేను అర్థం చేసుకున్న అతి కొద్ది భాగాన్ని, మీకు తెలిసిన అతి కొద్ది భాగాన్ని మాత్రమే నేను సినిమా తీశాను. ఇది ఉడత సాయం కిందికే వస్తుంది. నేను బాల్యంలో టీవీలో చూసిన రామాయణం చాలా పెద్దది. కానీ నేను రామాయణంలోని కొంత భాగాన్ని మాత్రమే సినిమాగా తీశాను, కేవలం యుద్ధకాండనే సబ్జెక్టుగా తీసుకున్నాను" అని ఓం రౌత్ వివరించారు.


More Telugu News